శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Feb 11, 2020 , 00:00:06

సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి

సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ దేవసేన సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ, పట్టణ కేంద్రాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఫోన్‌ ద్వారా కలెక్టర్‌కు విన్నవించగా వెంటనే పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పని సరిగా హాజరుకావాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలు, పెండింగ్‌లో పెట్టిన అర్జీల వివరాలు ఉండాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే సంబంధిత ఫిర్యాదుదారుడికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు  నమ్మకంతో ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారని, వారి నమ్మకాన్ని అధికారులు వమ్ము చేయవద్దన్నారు. అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సేలందించాలన్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు ప్రజావాణి దాకా రారన్నారు. కిందిస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే అర్జీలు వెల్లువెత్తున్నాయని, ప్రజావాణికి ఒకసారి వచ్చిన అర్జీ రెండోసారి రాకుండా చూడాలన్నారు. పోలీస్‌స్టేషన్‌, తహసీల్‌ కార్యాలయాల్లో రోజు వారీగా వచ్చే అర్జీలపై వెంటనే స్పందించాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో నటరాజన్‌, ఆర్‌డీవో సూర్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఆశన్న, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తమ్‌కుమార్‌ జాడే, జిల్లా వైద్యాధికారి తొడసం చందు, వ్యవసాయ శాఖ అధికారి శివకుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

దివ్యాంగులకుప్రభుత్వం అండ..  

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ దేవసేన అన్నారు. దివ్యాంగుల జాతీయ వేదిక క్యాలెండర్‌ను ఆమె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆ సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగులు పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.


logo