గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 09, 2020 , 23:36:07

యాసంగి పంటలకు సాగునీరు

యాసంగి పంటలకు సాగునీరు

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ  ప్రతినిధి : జిల్లాలో యాసంగి పంటలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతున్నది. జైనథ్‌ మండలం సాత్నాల, తాంసి మండలం మత్తడి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా రెండో పంటకు నీరు సరఫరా అవుతున్నది. సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు 24 వేల ఎకరాలు కాగా తెలంగాణ  ప్రభుత్వం మూడేండ్ల కిందట ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నది. కాలువలు, లైనింగ్‌ వాల్స్‌, డ్రాప్‌లు, తూముల మరమ్మతులు చేపట్టింది. దీంతో ఆయకట్టు రైతులు రెండు పంటలు సాగుచేసుకుంటున్నారు. అధికారులు కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. యాసంగిలో పంటలకు అవసరమైన నీరు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా రైతులు వానాకాలం సీజన్‌లో పత్తి, సోయాబిన్‌, కంది, పెసర పంటలను సాగు చేస్తారు. ఈ సీజన్‌లో వర్షాలపై ఆధారపడి ఎక్కువగా పంటలు వేస్తారు. యాసంగిలో శనగ, గోధుమ, పల్లి, జొన్న పంటలను పండిస్తారు. ఎక్కువగా వ్యవసాయ బావులు, బోర్లు ఉన్న రైతులతో పాటు చెరువులు, ప్రాజెక్టుల కింద భూముల ఉన్న రైతులు రెండో పంటను వేస్తారు. ఈ ఏడాది 24 వేల హెక్టార్లలో రైతులు యాసంగి పంటలు వేశారు. గతేడాది వానాకాలంలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన సాత్నాల, మత్తడి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వానాకాలంలో అధికారులు రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలారు. వానాకాలం సీజన్‌ చివరలో రెండు ప్రాజెక్టుల్లో పంటల సాగుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం యాసంగి పంటకు నీరు అవసరం ఉండడంతో సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల ద్వారా పంటలకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు 24 వేల ఎకరాలు కాగా మత్తడి ప్రాజెక్టు కింద 7 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. రెండు ప్రాజెక్టుల ద్వారా వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పుష్కలంగా నీరు.. 

గతేడాది వానాకాలం సీజన్‌లో కురిసిన వానలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 458 చెరువులు, కుంటలు నిండగా.. ప్రాజెక్టుల్లో సైతం భారీగా నీరు చేరింది.  సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 285.80 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్య 1.24 టీఎంసీలు కాగా అధికారులు 1.068 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. మత్తడివాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా 277.10 మీటర్ల వరకు నీరు చేరింది. మత్తడి ప్రాజెకు నీటి నిల్వ సామర్థ్యం 0.523 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.458 టీఎంసీల వరకు అధికారులు నీటిని నిల్వ చేశారు. సాత్నాల ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా రైతులు వానాకాలం, యాసంగి పంటలను సాగుచేసుకునే అవకాశం లభించింది. మత్తడి ప్రాజెక్టు ఆయకట్టు 8,500 ఎకరాలు కాగా రైతులు మత్తడి కింద రెండు పంటలను వేసుకొని అవసరమైనప్పుడు విడతల వారీగా సాగునీరు పంటలకు అందిస్తున్నారు. రెండు ప్రాజెక్టుల ద్వారా వానాకాలం పంటలకు కూడా అధికారులు నీటిని విడుదల చేశారు.

సాత్నాల చివరి ఆయకట్టు పంటకు సాగునీరు.. 

సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువ దిగువన లక్ష్మీపూర్‌ వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఉండగా వానాకాలం సీజన్‌లో ప్రాజెక్టు కాలువల ద్వారా ఇందులోకి అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు రైతుకు నీరు అందేలా మూడేండ్ల కిందట ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని సైతం పెంచారు. గతంలో లక్ష్మీపూర్‌ రిజర్వాయర్‌ కింద పంటలకు కాలువలోకి నీరు విడుదల చేసిన చివరి ఆయకట్టు వరకు నీరు అందేది కాదు. కాలువల లీకేజీలు, మిగితా నిర్మాణాలు సరిగా లేకపోవడంతో నీరంగా వృథా అయ్యేది. దీంతో సగానికి పైగా ఆయకట్టు రైతుల భూములకు నీరు రాక పంటలు నష్టపోయేవారు. అధికారులు కాలువల మరమ్మతులు, లైనింగ్‌, వాల్స్‌, డ్రాప్‌లు, తూముల మరమ్మతు పనులను పూర్తి చేయడంతో ప్రస్తుతం చివరి ఆయకట్టు రైతు పంటలకు నీరు అందుతుంది.


logo