శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 09, 2020 , 23:33:40

గజగజ..

గజగజ..

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో రెండ్రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా చలి తగ్గి ఎండాకాలం వాతావరణం ప్రభావం కనపడుతుండగా శనివారం నుంచి వాతావరణం చల్లపడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా చలికాలం ప్రభావం కనపడుతున్నది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు చినుకులు కురుసున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రత కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చలికాలం ముగుస్తుండగా కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. 19 డిగ్రీల కనిష్ఠ, 30 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లాలో కొన్ని రోజులుగా ఎండకాలాన్ని తలపించే వాతావరణం కనపడుతున్నది. ఈ ఏడాది చలికాలం సీజన్‌ జిల్లాలో తన ప్రభావాన్ని చూపింది. డిసెంబర్‌ నెలలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి రెండో వారం వరకు కూడా చలితీవ్రత కొనసాగింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో చలి క్రమంగా తగ్గుముఖం పట్టింది. శనివారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం జిల్లాలో 15.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మధ్యాహ్న ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. 23.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. బోథ్‌ మండలం సొనాలలో 14.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌ మండలం పొచ్చరలో 15 డిగ్రీలు, భీంపూర్‌ మండలం అర్లిలో 15.3 డిగ్రీలు, నేరడిగొండలో 15.3 డిగ్రీలు, గుడిహత్నూర్‌లో 15.4 డిగ్రీలు, సిరికొండలో 15.4, ఇచ్చోడలో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణుకుతున్న జనం.. 

రెండ్రోజులుగా చలితీవ్రత పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఆకాశంలో  మబ్బులు ఉండడంతో ఎండ రావడం లేదు. రోజంతా ఈదురు గాలులు వీస్తుండడంతో చలి ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లతో పాటు వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తమ పనుల కోసం బయటకు వచ్చేవారు సెట్వర్లు, తలకు మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, అస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, చలిగాలికి తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


logo