ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 09, 2020 , 23:26:35

నులిపేద్దాం..

నులిపేద్దాం..

ఎదులాపురం : నులి పురుగులను నివారణ చర్యల్లో భాగంగా అల్బెండజోల్‌ మాత్ర పంపిణీకి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఒకటి నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలకు మాత్రలు పంపిణీ చేయనున్నారు. పిల్లలను నులి పురుగుల నుంచి రక్షించడానికి ఎన్‌హెచ్‌ఎం(నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రతిఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో  భాగంగా ఈనెల 10వ తేదీన అల్బెండజోల్‌ మాత్రలను వైద్యారోగ్య శాఖ పంపిణీ చేయనుంది. సోమవారం రోజున మాత్రలు వేసుకోని వారికి 17వ తేదీన అందిచనున్నారు.  ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 


నులిపురుగులను తరిమేద్దాం..

నులిపురుగును తరిమేద్దాం.. పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందిద్దామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ తొడసం చందు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నులి పురుగుల నిర్మూలనకు సంబంధించిన మాత్రలు, వాల్‌పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మ జీవులు (పరాన్న జీవులు) నులి పురుగులు అని, ఇవి చిన్నారులు తీసుకున్న ఆహారంలో నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయన్నారు. దీంతో చిన్నారుల్లో పోషకాహార లోపం, అకలి లేకపోవడం, కడుపునొప్పి, శక్తిహీనత వంటి సమస్యల వస్తాయని తెలిపారు. నులి పురుగులను నివారిస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మారుతారని అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య సంస్థ చిన్నారుల్లో ఆరోగ్యకరమైన లక్షణాలను పెంపొందించేందుకు ఏలికపాముల నివారణకు చర్యలు చేపట్టిందని, ఆగస్టు 8, ఫిబ్రవరి 10వ తేదీల్లో ఏడాదికి రెండుసార్లు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా నేడు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1-19 ఏళ్ల వయస్సు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 2,66,675 మంది పిల్లలకు ఈ మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో ఉన్న కేజీబీవీలో మధ్యాహ్నం 1.15 గంటలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీని కలెక్టట్‌ శ్రీ దేవసేన ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమ పరిశీలకుడిగా డాక్టర్‌ రాజీవ్‌రాజ్‌ను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, మీడియా అధికారి వెంకట్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది సచిన్‌, చేతన్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేడు ఆకాశవాణిలో ప్రసారం..

ఆదిలాబాదు టౌన్‌ : జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని.. చిన్న పిల్లల్లో వచ్చే నులిపురుగు వ్యాధి వ్యాప్తిపై జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి తొడసం చందు చెప్పిన సలహాలు సూచనలు నేడు ఉదయం 7:15 ని.లకు ఆకాశవాణి రేడియోకేంద్రంలో ప్రసారమవుతాయని ఆకాశవాణి కేంద్రం ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుమనస్తిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రోతలు ఈ విషయాన్ని గమనించి.. ప్రసారాన్ని వినాలని తెలిపారు.  


logo