శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 09, 2020 , 23:25:31

కరోనా కలవరం

కరోనా కలవరం

ఆదిలాబాద్‌ :చైనాలో తీవ్రంగా ప్రబలిన కరోనా వైరస్‌తో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాధి లక్షణాలు పక్క దేశాల్లో బయట పడతాయేమోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాల మాదిరే ఉండే కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. చైనాలో వందలాది మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. దగ్గు, జలుబు, గాలి, స్వర్శ, ఆహార పదార్థాలు తదితర వాటిని ముట్టుకుంటే అంటుకొనే ఈ వ్యాధి స్వైన్‌ఫ్లూ లక్షణాల మాదిరే ఉండడం, రోగి పరిస్థితి త్వరగానే విషమించే అవకాశం ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్కకేసు కూడా నమోదు కాకున్నా.. కరోనా పేరు వింటేనే జనం జంకుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధి రాకుండా నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.  

భయపడుతున్న జనం..

చైనా దేశంలో కరోనావైరస్‌తో వందలాది మంది మృత్యువాతపడ్డారు. పుహన్‌ నగరంలో ఈ వ్యాధి ఎక్కువగా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చైనా నుంచి భారతదేశంలోకి ఈ వ్యాధి వ్యాప్తి చెందవచ్చన్న వదంతుల నేపథ్యంలో వైద్యులు తగు సూచనలు చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించడంతో కరోనావైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు నిజం కావని అంటున్నారు. హైదరాబాద్‌లో కేసులు నమోదు అయ్యాయన్న వార్తలు దావానలంలా వ్యాపిస్తున్నా వాటిని నమ్మొద్దని అంటున్నారు. జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటే మంచిదని వెద్యులు సూచిస్తున్నారు. సైన్‌ఫ్లూ లాంటి ఈ కరోనా వ్యాధికి నివారణ చర్యలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. 

అపోహలు నమ్మొద్దు..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కారోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదు. ఎలాంటి అపోహలను జిల్లా ప్రజలు నమ్మొద్దు. ముందు జాగ్రత్త చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండకూడదు. జలుబు, తలనొప్పి, జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.


ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి 

కరోనా వైరస్‌ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డాక్టర్‌ యోగితారాణా ఆదేశాల ప్రకారం మేరకు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్‌ను దూరంగా ఉంచడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. రద్దీగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్క్‌లు ధరించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరిశుభ్రత పాటించడంతో కరోనా వైరస్‌ దరిదాపుల్లోకి రాదు. భారతదేశంలో ఉష్ణోగ్రతల దృష్ట్యా కరోనావైరస్‌ వ్యాప్తి చెందదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశుభ్రత పాటిస్తే ఏ వ్యాధులు సక్రమించవు. 


logo