బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 08, 2020 , 23:56:31

ముగిసిన నామినేషన్ల గడువు

ముగిసిన నామినేషన్ల గడువు

తాంసి : జిల్లాలో సహకార సమరానికి నామినేషన్ల గడువు శనివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు నామినేషన్‌లు స్వీకరించగా జిల్లాలోని మొత్తం 28 పీఏసీఎస్‌లకు గానూ 699 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి.  ఏకగ్రీవానికి సంబంధించిన సమాచారం సంబంధిత అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఆదివారం నామినేషన్లను పరిశీలించి సోమవారం వరకు నామినేషన్‌ల విత్‌డ్రాకు అవకాశం ఉంది. ఈనెల 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆరోజు సాయంత్రం 5గంటలకు ప్రకటించనున్నారు. మొత్తం 699 నామినేషన్లు

ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 28 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. అందులో 46,756 మంది సభ్యులున్నారు. మొత్తం వార్డులు 360 ఉండగా నామినేషన్‌ల గడువు ముగిసే సమయానికి 699 నామినేషన్లు వచ్చాయి. చాలా వార్డుల్లో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయ్యాయి. ఈ వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లుగా సహకార ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

వార్డులకు ఒకే నామినేషన్‌...

జిల్లాలో చాలా వార్డులకు ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయ్యాయని సమాచారం. దీంతో ఆ వార్డులు ఏకగ్రీవం అయినట్లు లెక్క. జిల్లాలోని మెజార్టీ సహకార సంఘాలను అధికార టీఆర్‌ఎస్‌ సభ్యులు కైవసం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి నాయకులు పక్కా ప్రణాళి రచించినట్లు  కనబడుతోంది. మొదట పీఏసీఎస్‌ డైరెక్టర్లను ఏకగ్రీవం చేయడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు విజయవంతం అయ్యారు. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో చాలా చోట్ల వారు టీఆర్‌ఎస్‌తో రాజీ కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది  చాలా  సంఘా ల్లో ఒకటో రెండో వార్డులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఇచ్చి మిగతావన్ని టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకున్నారు. 

వార్‌ వన్‌సైడే 

జిల్లాలో మొత్తం 28 ప్రాథమిక సహకార సంఘాలుండగా క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఏ ఒక్క స్థానంలో ప్రతిపక్షపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ గెలిచే పరిస్థతి లేదు. డీసీసీబీపై గులాజీ జెండా ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పావులు కదిపారు. దీంట్లో సక్సెస్‌ అయినట్లు కనబడుతోంది.

సంబురాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు...

తాంసిలోని పీఏసీఎస్‌లలో 13 వార్డులుండగా రిజర్వేషన్‌ అభ్యర్థులు లేనిచోట 12 వార్డులను సహకార శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి చాలా పీఏసీఎస్‌లలో  టీఆర్‌ఎస్‌ పార్టీ రెండంకెల స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో నామినేషన్ల గడువు ముగియగానే అధికార పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారం కాబోయే చైర్మన్లను శాలువాలు, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 


logo