బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Feb 08, 2020 , 23:54:33

సదరం బాధలు ఉండవిక

సదరం బాధలు ఉండవిక

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:జిల్లాలో 7310 మంది దివ్యాంగులు ఉండగా ప్రభుత్వం వారికి నెలకు రూ. 3016 పింఛన్‌ను పంపిణీ చేస్తుంది. అర్హులైన దివ్యాంగులకు పింఛన్‌ అందేలా చర్యలు తీసుకుంటుంది. సర్కారు అందిస్తున్న పింఛన్‌ డబ్బులు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం అందజేసే సాయం పొందాలంటే వైకల్య నిర్ధారణ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  వైద్య ఆరోగ్య, సంక్షేమ శాఖలతో కలిసి సదరం శిబిరాలను నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో వైద్య నిపుణులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. జిల్లాలోని రిమ్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ శిబిరాలను నిర్వహించేవారు. ఈ శిబిరాల నిర్వహణలో జాప్యం జరగడం, ఎక్కువ సంఖ్యలో దివ్యాంగులు ఈ శిబిరాలకు రావడంతో వారు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రిమ్స్‌లో గతంలో ప్రతి మంగళవారం సదరం శిబిరం నిర్వహించే వారు. కొంతకాలంగా ముందుగా తేదీలను తెలియజేసి వారికి ధ్రువీకరణ  పత్రాలు అందజేస్తున్నారు. తీవ్ర జాప్యం కారణంగా అర్హులు సైతం పింఛన్‌ను పొందడంలో నిరీక్షించాల్సి వచ్చేది.

మీ సేవ కేంద్రాలో దరఖాస్తు చేసుకునే అవకాశం

 అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్‌ను అందజేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. దివ్యాంగులు ఇబ్బందులను నివారించడానికి మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. సదరం ధ్రువపత్రం అవసరమైన వారు నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్‌కార్డును జతపర్చి దరఖాస్తు చేసుకుంటే రసీదు ఇస్తారు. పరీక్షల కోసం దవాఖానకి ఎప్పుడు పోవాలో, దవాఖాన వివరాలను రసీదులో తెలియజేస్తారు. పట్టణంలోని రిమ్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. రసీదులో సూచించిన విధంగా దరఖాస్తుదారులు ఆ తేదీల్లో దవాఖానలకు పోతే ఆ రోజు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. వైద్యులు అందుబాటులో ఉండే తేదీలను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మీ సేవ దరఖాస్తుల ఆధారంగా వారు సూచించిన తేదీల్లో రోజుకు 40 మంది చొప్పున వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అదే రోజు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. గతంలో పలు మార్లు వైక్యల నిర్ధారణ పరీక్షల్లో అర్హత సాధించని వారు తరచూ శిబిరాలకు హాజరయ్యే వారు. దీంతో శిబిరాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.  ప్రస్తుతం అమలు చేసే విధానంతో ఒకసారి పరీక్షల్లో తిరస్కరణకు గురైన వారి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసుకునే అవకాశం ఉండదు. వీటి ఆధారంగా దివ్యాంగులు పింఛన్‌లు పొందే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పింఛన్‌ పొందుతున్న వారి సదరం పత్రాల రెన్యూవల్‌ సైతం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.


logo
>>>>>>