బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 08, 2020 , 23:50:57

ఆదివాసీ మహిళా కుటుంబాన్ని ఆదుకోవాలి

ఆదివాసీ మహిళా కుటుంబాన్ని ఆదుకోవాలి

బోథ్‌, నమస్తే తెలంగాణ : ఆత్మహత్యకు పాల్పడిన బోథ్‌ మండలం అందూర్‌ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ నైతం లలిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆదివాసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. గ్రామస్తులతో పాటు సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైతం లలిత మృతికి కారకుడైన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. అనాథలైన పిల్లలకు ఉచితంగా కార్పోరేట్‌ విద్యను అందించాలన్నారు. ఆందోళన చేస్తున్న వారితో బోథ్‌ ఇన్‌చార్జీ సీఐ మల్లేశ్‌, ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై సతీశ్‌ కుమార్‌ మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినా వినిపించుకోలేదు. తహసీల్దార్‌ ఎం శివరాజ్‌ అక్కడికి చేరుకొని కలెక్టర్‌ నివేదించి న్యాయం చేస్తామని తెలిపినా ఆందోళన విరమించలేదు. జిల్లా స్థాయి అధికారి వచ్చి లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే విరమిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆదిలాబాద్‌ ఆర్డీవో సూర్యనారాయణ వచ్చి వారితో పలుమార్లు చర్చలు జరిపారు. కాల్‌డేటా ఆధారంగా జాదవ్‌ సకారాంపై కేసు నమో దు చేసి అరెస్టు చేయిస్తామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పిల్లలను చదివిస్తామన్నారు. ఎక్స్‌గ్రేషియా విషయమై కలెక్టర్‌తో ఆర్డీవో ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబానికి తక్షణమే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మిగిలిన రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా కోసం కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని ప్రకటించారు. అక్కడికి చేరుకున్న బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ తనవంతుగా పిల్లలకు రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారు. సోమవారం బాధిత కుటుంబీకులను, ఆదివాసీ నాయకులతో కలిసి వెళ్లి కలెక్టర్‌కు సమస్యలు విన్నవించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్‌, జిల్లా అధ్యక్షుడు గొడాం గణేశ్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కుడాల స్వామి, మెస్రం భూమన్న, సలాం జంగు పటేల్‌, రామెల్లి భోజన్న, మెస్రం నగేశ్‌, ఆత్రం వెంకటేశ్‌, సోయం బాపురావు, జుగునక్‌ సంభన్న, తొడసం బండు, మెస్రం సుదర్శన్‌, మడావి గంగారాం, కుర్మె రాజన్న, రాయిసిడాం ఇస్రు, శేక్‌ శంశొద్దీన్‌, అందూర్‌, వివిధ గ్రామాల ఆదివాసీలు, మహిళలు పాల్గొన్నారు. 


logo