శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 08, 2020 , 23:50:57

ఎస్సెస్సీ ఉత్తీర్ణత బాధ్యత ప్రధానోపాధ్యాయులదే

ఎస్సెస్సీ ఉత్తీర్ణత బాధ్యత ప్రధానోపాధ్యాయులదే

ఆదిలాబాద్‌ రూరల్‌:  మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు సమీపించినందున వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులను ఇంతకు ముందే గ్రూపులుగా చేసినట్లు గుర్తుచేశారు. వారందరూ ఉత్తీర్ణులయ్యేలా ఇన్‌చార్జి ఉపాధ్యాయులు చూడాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఆధార్‌ అటెండెన్స్‌ తప్పని సరిగా వేయించాలని, లేకుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. అటెండెన్స్‌పై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫిట్‌ ఇండియా కార్యక్రమం విజయంవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని, మనబడి-మనతోట కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి నిలుపాలన్నారు. గతంలో జరిగిన ఏబీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం తప్పని సరిగా వచ్చేలా చూడాలన్నారు. సెక్టోరల్‌ అధికారులు నర్సయ్య, కంది శ్రీనివాస్‌రెడ్డి, ఓపెన్‌స్కూల్‌ కో-ఆర్డినేటర్‌ అశోక్‌, ఏఎస్‌వో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


logo