శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 23:58:03

అవినీతికి ఆస్కారం ఉండొద్దు

అవినీతికి ఆస్కారం ఉండొద్దు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: అవినీతి రహిత పాలనను కొనసాగించి ప్రజలకు సంపూర్ణ న్యాయం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ దేవసేన అన్నారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా అధికారులంతా పూర్తిస్థాయిలో సామర్ధ్యాలను వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అవినీతి, తప్పుడు నివేదికలు తనకు నచ్చవని స్పష్టంచేశారు. ఈ రెండుటికీ అధికారులంతా దూరంగా ఉంటూ తమ నైపుణ్యాలను నిరూపించుకోవాలని సూచించారు. ప్రజలు మనకిచ్చిన అవకాశం, మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి సేవలందించాలన్నారు. తప్పడు సమాచారం, తప్పుడు నిర్ణయాలకు దారితిస్తుందన్నారు. అలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తపడాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు మండల స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ప్రజల సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. శాఖల వారీగా ఎన్ని అర్జీలు వచ్చాయి..ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. పూర్తి సమాచారంతో రావాలన్నారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్థిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో నటరాజన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్‌ ఏవో అరవింద్‌, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు శంకర్‌, ఆశన్న, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తమ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ పాల్గొన్నారు. 

పలు విభాగాల పరిశీలన..

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవసేన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని కలియతిరిగారు. వివిధ శాఖల కార్యాలయాలను సందర్శించారు. కార్యాలయ మరుమ్మతు పనులను పరిశీలించి జాప్యంపై ఆరా తీశారు. తర్వితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని అడ్మినిస్ట్ట్రేటివ్‌ అధికారిని ఆదేశించారు. మార్పులు, చేర్పులపై సూచనలు ఇచ్చారు. 


logo