శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 23:56:56

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఆదిలాబాద్‌ రూరల్‌: మార్చిలో నిర్వహించే ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, డీఐఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్షా సమయానికి విద్యార్థులను కేంద్రాలకు తరలించడానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ దేవసేన, డీఐఈవో దస్రూనాయక్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఉట్నూర్‌ రూరల్‌: కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి ఈశ్వర్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని లాల్‌టేక్డి పాలిటెక్నిక్‌ కళాశాలలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రజలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే  నిర్లక్ష్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలన్నారు. కుష్టు అంటువ్యాధి, ప్రమాదకరం కాదని తెలిపారు. ఇది సోకిన వారికి చర్మం మీద మొద్దు బారిన మచ్చలు ఏర్పడుతాయని, శరీరం నూనే పూసినట్లు నిగనిగలాడడం, చెవి వెనుక భాగాన కణతలు ఏర్పడుతాయని వివరించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే సమీప పీహెచ్‌సీకి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.  వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది, వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిల్‌ చౌహాన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


logo