గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 01:09:16

వ్యర్థాల నిర్వహణకు చర్యలు

వ్యర్థాల నిర్వహణకు చర్యలు
  • బల్దియాలో వ్యర్థ శుద్ధీకరణకు చురుగ్గా ఏర్పాట్లు
  • బంగారుగూడలో ప్లాంటు
  • మున్సిపాలిటీకి అదనపు ఆదాయం
  • త్వరలో ప్రారంభం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. వీటిల్లో 10 శివారు ప్రాంతాల వార్డులు కాగా మిగితావి పట్టణంలో ఉంటాయి. బల్దియా పరిధిలో వ్యాపార, వాణిజ్య సముదాయలతో పాటు 28,020 నివాస గృహాలు ఉండగా సిబ్బంది రిక్షాలు, ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరిస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలుసైతం మున్సిపల్‌ సిబ్బంది తీసుకుపోతారు. వీటితో పాటు సెప్టిక్‌ ట్యాంకుల నుంచి సేకరించిన మలిన పదార్థాలను సేకరించి పరిసర ప్రాంతాల్లో పడవేయడంతో అక్కడ దుర్గంధం వ్యాపిస్తుంది. దీంతో పరిసరా ప్రాంతాల్లో నివాసం ఉండేవారు ఇబ్బందులుపడుతుండడంతో పాటు వాతావరణం కాలుష్యంగా మారుతుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సుమారు ఎకరం స్థలంలో వ్యర్థాల నిర్వహణ పరిశ్రమలను నిర్మించి చుట్టూ మొక్కల పెంపకాన్ని చేపడుతారు. బంగారుగూడ డంపింగ్‌యార్డులో ఇప్పటికే సేంద్రియ ఎరువుల తయారీలో భాగంగా వానపాముల పెంపకం చేపట్టారు. త్వరలో పాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ పరిశ్రమ సైతం ఏర్పాటు కానుంది. వీటికోసం బల్దియా డంపి ంగ్‌యార్డులో స్థలాన్ని అద్దెరూపంలో కేటాయించింది. 


మలినాలతో ఎరువుల తయారీ

పట్టణ పరిధిలో సేకరించిన మలిన పదార్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు. ఇందుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ కర్మాగారం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రెస్టిన్‌ భారత్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు అప్పగించింది.  రూ. కోటి  వరకు ఖర్చవుతుండగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఎకరం స్థలంలో ఏర్పాటు చేసి ఈ ఫ్యాక్టరీ కంపౌండ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయింది. మలినాలను ట్యాంకుల  ద్వారా కర్మాగారానికి తరలించి సంపులో వేయగానే మలిన పదార్థాలు శుద్ధీగా మారి ఎరువులుగా తయారవుతాయి. వీటిని పంట  పొలాలతో పాటు మొక్కల పెంపకానికి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. పట్టణంలో సెప్టిక్‌ ట్యాంకుల ద్వారా సేకరించి మలినాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఈ కర్మాగారానికి తీసుకువస్తారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజల ఇబ్బందులు దూరం కావడంతో పాటు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. 


పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకీ డంపింగ్‌యార్డు కోసం 36 ఎకరాల స్థలం ఉంది. ఎక్కువ స్థలం ఉండటంతో వివిధ రకాల వ్యర్థాల నిర్వహణ కోసం పలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే వానపాముల తయారీ జరుగుతుండగా, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మలినాల నుంచి ఎరువుల తయారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభమవుతాయి. బల్దియాకు ఆదాయం సైతం సమకూరుతుంది.

- జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ 


logo