బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 07, 2020 , 01:07:34

పకడ్బందీగా కారుణ్య నియామకాలు

పకడ్బందీగా కారుణ్య నియామకాలు

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఉమ్మడి జిల్లా పరిషత్‌లోని మండల పరిషత్‌ కార్యాలయాలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయలతో పాటు వివిధ ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య, ఇతర కారణాలతో పలువురు ఉద్యోగుల మరణించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 మంది ఉద్యోగులు చనిపోగా వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. 2012 వరకు ఉపాధ్యాయులతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తూ మరణించిన జిల్లా పరిషత్‌ ఉద్యోగులకు అధికారులు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా పరిషత్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీలు లేకపోవడంతో ఉద్యోగాల కారుణ్య నియామకాల్లో కుటుంబసభ్యులకు ఇవ్వడంలో జాప్యం జరిగింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. మరణించిన ఉద్యోగుల వివరాలతో పాటు వారి ఉద్యోగాలకు అర్హత ఉన్న కుటుంబసభ్యుల వివరాలను అధికారుల నుంచి సేకరించి కారుణ్య నియమాకాల ప్రక్రియ వేగవంతం చేయాలని నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


నెల రోజుల్లో నియామకాలు పూర్తి

ఉమ్మడి జిల్లాలో 2012 నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంతో పాటు మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ పాఠశాలలు, మండల పరిషత్‌ స్కూళ్లలో పనిచేస్తున్న 68 మంది ఉద్యోగులు మరణించారు.  జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ విభాగాల్లో 7 ఖాళీలు మాత్రమే ఉండగా వీలైనంత ఎక్కువ మందికి కారుణ్య నియమాకాల్లో భాగంగా ఉద్యోగాలు వచ్చేలా జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ చర్యలు చేపట్టారు. జీవో నంబర్‌ 427 ప్రకారం కలెక్టర్‌కు ఐదు సూపర్‌ న్యూమొరీ పోస్టుల్లో  ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండగా జడ్పీ చైర్మన్‌ వీటి భర్తీ కోసం కలెక్టర్‌ను సంప్రదించారు. స్పందించిన కలెక్టర్‌ ఐదు సూపర్‌ న్యూమొరీ పోస్టులను భర్తీకీ అంగీకరించారు. ఉమ్మడి జిల్లాలో వివిధ జిల్లా పరిషత్‌లలో 13 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు లభించాయి. నాలుగు జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌ లలో ఐదుగురికి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా, ముగ్గురికి టైపిస్ట్‌లుగా, నలుగురికి అటెండర్‌లుగా ఉద్యోగాలు కల్పించారు. సీనియారిటీ, రోస్టర్‌ విధానం నిబంధనల మేరకు వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. వీరికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ గురువారం జడ్పీ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు కల్పించిన జడ్పీ చైర్మన్‌, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 


అంకితభావంతో పనిచేయాలి

జిల్లా పరిషత్‌లో కారుణ్య నియమాకాల్లో భాగంగా ఉద్యోగాలు పొందిన వారు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ కోరారు. నియామక పత్రాల ఇచ్చిన తర్వాత వారితో మాట్లాడారు. మిగితా వారికి సైతం ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని దశల వారీగా కారుణ్య నియమకాలు చేపడుతామని తెలిపారు. నియమాకాల్లో భాగంగా సీనియారిటీ, రోస్టర్‌, సర్టిఫికేట్ల వేరిఫికేషన్‌ లాంటివి పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఉద్యోగులు ప్రజలు మరింత సేవలు అందించి మంచి పేరు సంపాదించాలని కోరారు.


సాయం మరువలేనిది

మా నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 2016లో మరణించారు. దీంతో మా చదువులు, కుటుంబపోషణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. జిల్లా పరిషత్‌ చైర్మన్‌, అధికారులు స్పందించి నాకు త్వరగా ఉద్యోగం వచ్చేలా కృషి చేశారు. నాకు జూనియర్‌ అసిస్టెంట్‌గా నిర్మల్‌ జిల్లాలో ఉద్యోగం ఇచ్చారు. వారి చేసిన సాయం మరువలేనిది.

-ఎం. రంజిత్‌ కుమార్‌, ఉద్యోగి 


పిల్లలను బాగా చదివిస్తాను

నా భర్త మంచిర్యాల జిల్లా ఇందన్‌పల్లిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరణించారు. మాకు ఇద్దరు పిల్లలు  ఇన్ని రోజులు పిల్లల చదువులు, కుటుంబపోషణ కష్టంగా ఉండే ది. అధికారులు నాకు మంచిర్యాల జిల్లా లక్షెటిపేటలో ఉద్యోగం ఇచ్చారు. నాకు ఉద్యోగం రావడంతో ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుంటాను. జడ్పీ చైర్మన్‌, అధికారులకు కృతజ్ఞతలు

- రమణశ్రీ, ఉద్యోగిని, మంచిర్యాల 


logo