గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 06, 2020 , 00:55:31

ఖాతాల్లో రైతుబంధు డబ్బులు

 ఖాతాల్లో రైతుబంధు డబ్బులు
  • జిల్లాలో 1,23,007 మంది రైతులు
  • మార్కెట్‌యార్డుల్లో పంటను విక్రయిస్తూ లాభాలు
  • ట్రెజరీకి వివరాలు అందజేసిన వ్యవసాయ అధికారులు

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 1,23,007 మంది రైతులు ఉండగా వానాకాలంలో పత్తి, సోయాబీన్‌, కంది పంటలు సాగు చేశారు. యాసంగిలో శనగ, గోధుమ, పల్లి పంటలు పండిస్తారు. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు దళారులను ఆశ్రయించేవారు. వడ్డీ వ్యాపారులు, దళారులు ఎక్కువ శాతం వడ్డీని వసూలు చేయడంతో పాటు పంటలు తమకే అమ్మాలని షరతు విధించేవారు. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం జిల్లాలోని రైతులకు వరంగా మారింది. ఏటా ప్రభుత్వం అందజేసే పంటపెట్టుబడి డబ్బులతో పంటలు సాగుచేస్తున్నారు. పంటను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.


జిల్లాలో ఎక్కువ మంది పేద రైతులు ఉన్నారు. వానాకాలంలో వర్షాలపై ఆధారపడి ఎక్కువ పంటలు పండిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని రైతుల  పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఏటా మిరుగు ప్రారంభంలో మొగులు ఊరిమిందంటే రైతుల గుండెల్లో గుబులు పుట్టేదు. పంట పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరిని అడుగాలి, దళారులు ఎప్పుడు ఇస్తారు ఎంత వడ్డీ తీసుకుంటారని రైతులు బాధపడుతుండే వారు. ఏటా వానాకాలంలో రైతులు పంటపెట్టుబడుల కోసం సీజన్‌ నెల రోజుల ముందుగానే వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించేవారు. వారం పదిరోజులు వారి చుట్టూ తిరిగితే కాని అప్పు పుట్టని పరిస్థితి. ఆదిలాబాద్‌తో పాటు ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్‌, నేరడిగొండ లాంటి ప్రాంతాల్లో రైతులకు దళారులు విత్తనాలు, ఎరువులను ఉద్దెరపై ఇచ్చేవారు. వారు  వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు, ఎరువులు ఇస్తుండేవారు. అప్పులు ఇచ్చేటప్పుడు పలు షరతులు విధించేవారు. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు సూచించే అన్ని షరతులకు ఒప్పుకోక తప్పేది కాదు. లేకపోతే వచ్చే సంవత్సరం దళారులు అప్పు కింద విత్తనాలు, ఎరువులు ఇచ్చేవారు కాదు. 


వరంగా మారిన రైతుబంధు

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతుల పాలిట వరంగా మారింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలను పంపిణీ చేస్తుంది. ఈ సీజన్‌కు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. జిల్లాలో 1,23,007 మంది రైతులు ఉండగా వ్యవసాయశాఖ అధికారులు 1,03,456 మంది రైతులకు చెందిన వివరాలను ట్రెజరీకి పంపించారు. దీంతో వారం రోజులుగా రైతుల ఖాతాల్లో క్రమంగా డబ్బులు జమవుతున్నాయి. మూడేళ్లుగా రైతులకు రెండు సీజన్‌లకు గానూ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండటంతో దళారుల బెడద తప్పింది. ప్రభుత్వం అందిస్తోన్న సాయంతో తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో సకాలంలో పంటలు వేయడంతో పాటు ఎరువులు అందిస్తున్నారు. ఫలితంగా రైతులకు పంట దిగుబడులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.


తప్పిన దళారుల బెడద

ఏటా రైతులు పంట పెట్టుబడుల కోసం దళారులు చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి. దళారులు రైతుల అవసరాలను అవకాశంగా ఎంచుకుని వారిని నిలువుదోపిడి చేసేవారు. అప్పుగా డబ్బులకు బదులు విత్తనాలను, ఎరువులను ఇచ్చేవారు. నాసిరకమైన వాటిని ఇవ్వడమే కాకుండా అధిక వడ్డీలు, పంటలను సైతం తమకే అమ్మాలని షరతులు విధించే వారు. రూ.1లక్ష అప్పు ఇస్తే ఆరు నెలలకు గానూ రూ. 20వేల వడ్డీతో పాటు చెల్లించడమే కాకుండా వారు సూచించిన ధరకే రైతులు పంటలను అమ్మాలి. పంట దిగుబడులు ప్రారంభమైన వెంటనే దళారులు తమ మనుషులను అప్పు తీసుకున్న రైతుల ఇంటికి పంపి పంటను తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు పంటను దళారులకు పంటను అమ్ముకోని నష్టపోయేవారు. రైతుబంధు పథకం కారణంగా రైతులు మార్కెట్‌యార్డుల్లో ఎక్కువ ధరకు పంటను విక్రయిస్తున్నారు.


logo