మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 06, 2020 , 00:53:43

సహకార సమరానికి సై

సహకార సమరానికి సై
  • నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
  • క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీఆర్‌ఎస్‌
  • పెద్దమొత్తంలో ఏకగ్రీవాలకు వ్యూహం
  • టీఆర్‌ఎస్‌ నాయకులతో ఎమ్మెల్యేల సమావేశాలు

తాంసి(ఆదిలాబాద్‌) : ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం నుంచి సహకార సంఘాలు (పీఏసీఎస్‌) సభ్యుల ఎన్నికలకు నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా సహకార శాఖ అధికారులు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు నిర్వహంచి అనంతరం ఓట్ల లెక్కింపు  చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.


77 సంఘాలకు ఎన్నికలు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 77 ప్రాథమిక సహకార సంఘాలోని డైరెక్టర్‌ల ఎన్నికలకు సంబంధించిన నేటి నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.20లక్షల రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరందరికి ఓటు హక్కు కల్పించారు. ఈనెల 3న నోటిఫికేషన్‌ విడుదల కాగా నేటి నుంచి ఈనెల 8వ తేది వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. 9న నామినేషన్‌ల స్వీకరణ, 10 తేది వరకు నామినేషన్‌ల విత్‌డ్రా ఉంటుంది. ఈనెల 15 ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నాం 2గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి.. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.


క్లీన్‌స్వీప్‌ దిశగా టీఆర్‌ఎస్‌...

ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాలను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  పీఏసీఎస్‌ల గెలుపు బాధ్యతలను ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు అప్పగించారు. అందుకు సంబంధించి ఇప్పటికే రైతులతో, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని చాలామండలాల్లో డైరెక్టర్‌లను ఏకగ్రీవం చేసి... పెద్దమొత్తంలో పీఏసీఎస్‌ చైర్మన్‌లను, వైస్‌ చైర్మన్‌లను గెలిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని సంఘాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచేలా నాయకులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. నేటి నుంచి నామినేషన్‌లు వేసేలా సిద్ధం చేశారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలోని 77 పీఏసీఎస్‌లపై గులాబీ జెండా ఎగిరేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.


ఏకగ్రీవం కానున్న డీసీసీబీ చైర్మన్‌ అభ్యర్థులు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు వారి పరిధిలోని సంఘాన్ని ఏకగ్రీవం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ సంఘం సభ్యుడు చైర్మన్‌ అయితే భవిష్యత్‌లో తమకు ప్రాధాన్యం దక్కుతుందని ఆయా సంఘాల్లోని సభ్యులు ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించి చైర్మన్‌ రేసులో ఉన్న కొత్త ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఇప్పటికే డైరెక్టర్‌లను ఏకగ్రీవం చేసే దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా మండలాల్లోని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తుల, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించారు. తప్పకుండా తమకే ఈ పదవి వస్తుందని పార్టీ అధిష్టానం అండదండలు తమకు పూర్తిగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో మంచి పేరున్న నాయకులు డైరెక్టర్‌లను ఏకగ్రీవం చేసే బాధ్యతలను మండలస్థాయి నాయకుల చేతిలో పెట్టారు. మొత్తానికి ఎలాగైన డీసీసీబీ చైర్మన్‌ పదవి చేపట్టేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌లను గెలిచి టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురేయడానికి అధికార శ్రేణులు సిద్ధం అవుతున్నాయి.


logo
>>>>>>