ఆదివారం 24 మే 2020
Adilabad - Feb 06, 2020 , 00:51:31

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు
  • పాత దరఖాస్తులకు మరో ఛాన్స్‌
  • భారీగా దరఖాస్తులు
  • దరఖాస్తుల పరిశీలనకు అధికారులకు శిక్షణ
  • జనవరి 30 వరకు.. 1,550 దాఖలు
  • లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌కు భారీగా దరఖాస్తులు
  • మార్చి 31వరకు అవకాశం కల్పించిన ప్రభుత్వం


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ విలీన గ్రామాల్లో స్థలాలు, నివాస గృహాల లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన గడువు జనవరి 30తో ముగిసింది. దరఖాస్తుల పరిశీలన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వరంగల్‌లో బుధవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గురువారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన కొనసాగనుంది. పాత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లేఅవుట్లకు క్రమబద్ధీకరణ చేపట్టగా.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్చి 31వరకు గుడువునిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 


1550 దరఖాస్తులు..

మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది. పరిధి పెంచడానికి సమీప గ్రామాలను విలీనం చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో మావల, బట్టి సావర్గాం, అనుకంట, బెల్లూరి, రాంపూర్‌ గ్రామాలు విలీనం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుక వచ్చింది. గత ఏడాది నవంబర్‌ 29 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. విలీన గ్రామాల నుంచి 1550 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వివరించారు.  దరఖాస్తుల పరిశీలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు వరంగల్‌లో ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. మున్సిపాలిటీ తరఫున అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ అక్కడికి వెళ్లారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం లింకు డాక్యుమెంట్లతో పాటు రూ.10వేలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు జిరాక్స్‌ కాపీలు, స్థలం మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌, నోటరీ, సర్వేయర్‌ సంతకంతో కూడిన ప్లాన్‌, స్థలం ఫోటో, లే అవుట్‌ ప్లాన్‌ దరఖాస్తుకు జతపర్చాలి. ఇందులో ఏఒక్కటీ జతపర్చకున్నా సదరు దరఖాస్తును తిరస్కరించ నున్నారు. 


పాత దరఖాస్తులకు మరో ఛాన్స్‌..

ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక జీవోను విడుదల చేయించారు. పట్టణానికి ఆనుకొని కొంతమంది వ్యాపారులు టౌన్‌ప్లానింగ్‌ అనుమతి లేకుండా లే అవుట్‌ చేసి ప్లాట్లను విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ అయిన మున్సిపాలిటీలో యజమాని పేరు మోటేషన్‌ కాలేదు. దీంతో అక్రమ లే అవుట్లలో స్థలాలు కొన్న యజమానులు మున్సిపాలిటీల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. విషయమై రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పథకాలను అందుబాటులోకి తీసుకవచ్చింది.  అనుమతి లేని భవనాలు, స్థలాల విషయంలో అన్ని డాక్యుమెంట్లను జతపరిచిన వారికి బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్లు జతపర్చని దరఖాస్తులను తిరస్కరించారు. ఇప్పుడు ప్రభుత్వం మరో ఛాన్స్‌ ఇచ్చింది. గతంలో ఆన్‌లైన్‌ చేసిన వారు మార్చి 31వరకు లింకు డాక్యుమెంట్లు అందజేస్తే క్రమబద్ధీకరిస్తామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అంటున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


logo