శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 05, 2020 , 01:22:56

తారాస్థాయికి ‘కమలం’ వర్గపోరు

తారాస్థాయికి ‘కమలం’ వర్గపోరు

ఆదిలాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని భారతీయ జనతాపార్టీలో వర్గపోరు రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగా అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో వర్గపోరుకు దారితీశాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో 49 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 11 వార్డుల్లో గెలిచింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కొందరు నాయకులు జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను కాకుండా ఇతరులను పాయల్‌ శంకర్‌ పోటీకి నిలిపారని ఆ పార్టీ నాయకురాలు సుహాసినిరెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమికి పాయల్‌ శంకర్‌ కారణమని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కోసం కోర్‌ కమిటీని ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షుడు ఇష్టం వచ్చిన వారికి బీ ఫారాలు ఇచ్చారన్నారు. పార్టీలో పనిచేసిన వారు, ప్రజాదరణ పొందిన వారిని గుర్తించి టికెట్లు ఇవ్వాలని అధిష్టానం సూచించినా జిల్లా అధ్యక్షుడు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడిపై పార్టీ జిల్లా ఇన్‌చార్జికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ పదవులకు రాజీనామాలు చేసి కార్యకర్తలుగా కొనసాగుతామని పలువురు నాయకులు తెలిపారు. హైదరాబాద్‌కు బయలుదేరే ముందు నాయకురాలు సుహాసినిరెడ్డి మరోసారి పాయల్‌శంకర్‌పై విమర్శలు చేశారు.


హైదరాబాద్‌కు చేరిన జిల్లా పంచాయితీ

జిల్లాలోని బీజేపీ నాయకుల మధ్య కొనసాగుతున్న పంచాయతీ హైదరాబాద్‌కు చేరుకుంది. వారం రోజుల కిందట విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పరాజయం విషయంలో జిల్లా అధ్యక్షుడిపై విమర్శలు చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి తో పాటు మరికొందరు నాయకులు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసేందుకు వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. కొంత కాలంగా జిల్లా నాయకుడు పాయల్‌ శంకర్‌, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని దీంతో విసిగిపోయిన కార్యకర్తలు పార్టీ బాగుకోసం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కోర్‌ కమిటీతో సంప్రదించకుండానే బీ ఫామ్‌లు ఇచ్చారని, సమావేశాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని జిల్లాలో జరుగుతున్న పరిమాణాలను లక్ష్మణ్‌కు వివరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో వర్గపోరు తీవ్రంగా మారడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనని చర్చించుకుంటున్నారు.


logo