గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 05, 2020 , 01:21:37

బల్దియా ఆదాయంపై గురి

బల్దియా ఆదాయంపై గురి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  బల్దియాకు ఆస్తి పన్నులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6.31 కోట్లు టార్గెట్‌ ఉండగా.. ఇప్పటి వరకు 3.42 కోట్లు వసూలు అయ్యాయి. 54.20 శాతంగా ఉంది.  ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తుండగా.. గడువులోగా వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. ఇప్పటికే మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. పన్నుల వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు  చేశారు.  కార్యాలయంలో  ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా బిల్‌ కలెక్టర్లు, అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లకు విధులను కేటాయించి పన్నులను వసూలు చేస్తున్నారు.


పన్ను వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌..

ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు విలీన గ్రామాలను కలుపుకొని  మొత్తం 37,538 గృహాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలున్నాయి. ఇందులో ఏరియర్స్‌ రూ.15.22 లక్షలు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిమాండ్‌ రూ.6.16 కోట్లుగా ఉంది. రెండూ కలిపి రూ. 6.31కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ 49 వార్డులకు గాను ఏడుగురు బిల్‌ కలెక్టర్లతో, ఏడుగురు అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. ఆర్థిక సంవత్సరానికి గడువు సమీపిస్తుండగా..ఈ బృందాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు డోర్‌ టు డోర్‌ తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నాయి. మొండి బకాయిదారులకు ఇదివరకే డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన 15 రోజుల తర్వాత సదరు బకాయిదారుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో వారికి డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తారు. పన్ను చెల్లించని వారిపై శాఖా పరమైన చర్యలు సిద్ధమవుతున్నారు. బకాయిలు  సకాలంలో చెల్లించాలంటూ బల్దియా అధికారులు వార్డుల్లో మైక్‌ ప్రచారం, డప్పు చాటింపు లాంటి కార్యక్రమాలను సైతం చేపడుతున్నారు.


54.20 శాతానికి చేరుకున్న వసూళ్లు.. 

 రాంపూర్‌, అనుకుంట, మావల, బట్టిసావర్గాంలను కలిపి ప్రస్తుతం ఆదిలాబాద్‌ మున్సిపాల్టీ పరిధి 49 వార్డులుగా ఉంది. 2019 - 20 ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ రూ. 6.31 కోట్లుగా ఉన్నాయి. మార్చి 31తో గడువు ముగియనుండగా.. ఇప్పటి వరకు రూ. 3.42 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ. 2.89 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గత ఏడాది జనవరి 31 వరకు 45 శాతం మాత్రమే వసూలయ్యాయి. గడువులోగా సుమారు 97 శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలించింది. ఈ ఏడాది బల్దియా ఎన్నికలు రావడంతో పోటీ చేసే అభ్యర్థులు స్వచ్ఛందగా తమ ఆస్తి పన్నులను చెల్లించగా భారీగా పన్నులు వసూలు అయ్యాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది పన్నులు వేగంగా వసూలు అవుతున్నట్లు ఘనంకాలు చెబుతున్నాయి. గడువులోగా వంద శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో బల్దియాను అగ్రస్థానంలో నిలుపుతామని మున్సిపల్‌ అధికారులు అంటున్నారు. 


logo
>>>>>>