శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Feb 04, 2020 , 00:10:03

గోండిభాష నేర్చుకొని.. గిరిజనులతో మమేకం

గోండిభాష నేర్చుకొని.. గిరిజనులతో మమేకం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజ్‌  బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల శాఖ  కమిషనర్‌గా నియమితులయ్యారు. గిరిజనుల మధ్య గొడవల 2017 డిసెంబర్‌ 18న కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె జిల్లాలో ప్రశాంతమైన వాతావరణ నెలకునేలా చర్యలు తీసుకున్నారు. 25 నెలలకు పైగా కలెక్టర్‌గా పని చేసిన దివ్య పాలనలో తనదైన ముద్ర వేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేశారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె కిసాన్‌ మిత్ర సంస్థ ద్వారా రైతులకు పలు అంశాల్లో సలహాలు, సూచనలు అందజేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక సెల్‌ను ప్రారంభించి టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యలను ప్రతి వారం సమిక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం మండలాలను వారీగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన నిబంధలన మేరకు వాటిని పరిష్కరించారు. ప్రభుత్వం చేపట్టిన రెండు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్‌, సర్పంచ్‌, పార్లమెంట్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి కలెక్టర్‌ అవార్డును సైతం తీసుకున్నారు.

గోండి భాష నేర్చుకొని.. 

గతంలో జిల్లా కలెక్టర్లుగా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా పనిచేసిన పలువురు ఐఏఎస్‌ అధికారులు గిరిజనాభివృద్ధికి ఎనలేని కృషి చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సీవీఎస్కే శర్మ, ఎంవీవీపీ శాస్త్రీ, పి.సుబ్రమణ్యం లాంటి వారు గిరిజనుల్లో తమదైన ముద్రవేశారు. వారిని జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజలు నేటికీ గుర్తించుకుంటారు. అదే బాటను ఎంచుకున్న కలెక్టర్‌ దివ్య గిరిజనుల సమస్యలను వారి భాషలోనే తెలుసుకుంటే పూర్తిస్థాయి పరిష్కారం చూపవచ్చనే ఉద్దేశంలో గోండి భాషను నేర్చుకున్నారు. గతంలో ఐటీడీఏ పీవోగా పనిచేసిన పి.సుబ్రమణ్యం తర్వాత గోండి భాష నేర్చుకున్న అధికారిగా దివ్య నిలిచారు. ఉపాధి కల్పించడానికి వివిధ శాఖల నుంచి పథకాలను అమలు చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ  వారి సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ వారితో మమేకమయ్యారు.  

దుప్పట్ల పంపిణీ..

జిల్లాలో చలితీవ్రత కారణంగా పేదలకు ఉచితంగా చెద్దర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లను ఉచితంగా అందజేసేందుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా అధికారులు, ఇతరులు తనకు అందజేసే జ్ఞాపికలను శాలువాలు, స్వీట్లకు బదులు స్వెటర్లు, దుప్పట్లు తీసుకురావాలని సూచించారు. దీంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఎన్జీవోలు, స్థానికులు కలెక్టర్‌ పుట్టిన రోజు సందర్భంగా  చెద్దర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లను అందజేయగా వాటిని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు పేదలకు కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన నాగోబా దర్బార్‌లో మాట్లాడిన ఆమె.. కలెక్టర్‌గా మూడు సార్లు నాగోబా జాతరకు హాజరయ్యాయని, ఈ జ్ఞాపకాలు తనకు జీవింతాంతం గుర్తుండిపోతాయని అన్నారు. పది సంవత్సరాల తర్వాత తాను వచ్చినప్పుడు గిరిజనులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.


logo