బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 04, 2020 , 00:06:29

గ్రీవెన్స్‌కు అధికారుల డుమ్మా!

గ్రీవెన్స్‌కు అధికారుల డుమ్మా!

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో సంయుక్త కలెక్టర్‌ సంధ్యారాణి అర్జీలను స్వీకరించారు. దీనికి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 90 శాతానికి పైగా గైర్హాజరయ్యారు. ఉన్నతాధికారులు డుమ్మా కొట్టగా.. వారి శాఖ నుంచి ఒక్కో ఉద్యోగిని పంపించారు. తాజాగా జిల్లా కలెక్టర్‌ బదిలీ కావడం, వేరే కార్యక్రమాలకు వెళ్లడంతో సంయుక్త కలెక్టర్‌ అర్జీలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ లేకపోవడంతో తమను ఎవరూ ఏమనరనే ఉద్దేశంతో టూర్‌ పేరిట తప్పించుకున్నారు. శనివారం ఉదయం టూర్‌ పెట్టుకొని వెళ్లిన ఉన్నతాధికారులు తమ కుటుంబం నివాసముండే హైదరాబాద్‌ వెళ్తున్నారు. సోమవారం కూడా టూర్‌ వెళ్లినట్లు చూపి సాయంత్రానికి, రాత్రికి జిల్లాకేంద్రానికి చేరుకుంటున్నారు. గ్రీవెన్స్‌కు అధికారులు గైర్హాజరు కావడంతో ఖాళీ కుర్చీలు దర్శన మిచ్చాయి.

కలెక్టర్‌ హెచ్చరించినా మారని తీరు

గ్రీవెన్స్‌ సెల్‌ రోజునే పరిస్థితి ఇలా ఉంటే మామూలు సెలవు రోజుల్లో ఇక వేరే చెప్పనవసరం లేదు. ప్రతి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం(గ్రీవెన్స్‌ సెల్‌) కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి బాధితులు వ్యయ ప్రయాసలకోర్చి వస్తుంటారు. కలెక్టర్‌ ఉన్న రోజు అధికారులు దాదాపు అందరూ హాజరవుతుండగా.. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమావేశాలకు కలెక్టర్‌ వెళ్లాల్సి వస్తే ఆమె స్థానంలో జేసీ, డీఆర్‌వో ఫిర్యాదులను స్వీకరిస్తారు. కలెక్టర్‌ రాని రోజున వివిధ శాఖల అధికారులు కూడా డుమ్మా కొడుతున్నారు. తమ కింది స్థాయి సిబ్బందిని పంపించి తప్పించుకుంటున్నారు. గతంలో జిల్లా ఉన్నతాధికారులు డుమ్మా కొట్టడంపై కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అసహనం వ్యక్తం చేస్తూ తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదు.

రాజధానిలో నివాసం..

జిల్లాకేంద్రంలో సుమారు 70 వరకు వివిధ ప్రభుత్వ శాఖలుండగా.. సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా జిల్లాకేంద్రంలో నివాసం ఉండాలి. వీరిలో చాలా మంది పేరుకే నివాసముండగా.. తమ కుటుంబాలను హైదరాబాద్‌ కేంద్రంగా నివాసం ఉంచుతున్నారు. ఆదివారాలు, సెలవురోజుల్లో హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నారు. శనివారం ఉదయమే టూర్‌ పేరిట బయల్దేరి పని చూసుకొని మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు చేరుతున్నారు. సోమవారం మళ్లీ టూర్‌ పేరుతో మార్గమధ్యంలో మండలం చూసుకొని సాయంత్రం, రాత్రి జిల్లాకేంద్రానికి చేరుకుంటున్నారు. సెలవు రోజు వచ్చినా అదే పరిస్థితి. ముందూ, వెనుక రోజులూ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదు. దీంతో వివిధ పనులు, సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందికి గురవుతున్నారు. కొందరు హైదరాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం. రెండు రోజులు ఆదిలాబాద్‌లో.. రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. 


logo