గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Feb 03, 2020 , 01:17:53

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రైతు  సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  • పంటలకు మద్దతు ధర
  • ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోళ్లు ప్రారంభం
  • జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌
  • రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఆదివారం కందుల కొనుగోళ్లను ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. రైతుల కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. జిల్లాలో పత్తితోపాటు కంది పంటను అధికంగా సాగు చేస్తారని, ఈ రెండు పంటలకూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం సంతోషకరమని అన్నారు. కందులు క్వింటాలుకు రూ. 5800 మదతు ్దధర కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతును రాజు చేయడమే సీఎం లక్ష్యమని, రైతుబిడ్డగా సీఎం కేసీఆర్‌కు అన్నదాత కష్టాలు తెలుసన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ అందిచడంతోపాటు దాదా పు అన్ని పంటలకూ మద్దతు ధర కల్పిస్తుండడంతో రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. పెట్టుబడి సాయంతోపాటు యాసంగికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

 

ఎమ్మెలే జోగు రామన్న మాట్లాడుతూ.. కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులకు సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. వ్యాపారులు అక్రమంగా కందులను నిల్వచేస్తే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కందులను మార్కెట్లలో విక్రయించి మద్దతు ధరను  పొందాలని సూచించారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు కొనుగోళ్ల సమయంలో అందుబాటులో ఉంటూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా సూచించిన తేదీల ప్రకారం కందులను విక్రయానికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో  జేసీ సంధ్యారాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, మార్క్‌ ఫెడ్‌ మేనేజర్‌ పుల్లయ్య, మార్కెటింగ్‌ శాఖ ఏడీ, మార్కెట్‌ కార్యదర్శి, సూపర్‌వైజర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. 


నేడు కొనుగోలు కేంద్రాల ప్రారంభం

బేల/జైనథ్‌ : బేల, జైనథ్‌ మండల కేంద్రాల్లో సోమవారం నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు బేల, జైనథ్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు సుదాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లో కొనుగోళ్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు. జైనథ్‌ మండల కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తారని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం కూర వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణోత్సవాన్ని హాజరవుతారని తెలిపారు. మండలంలోని రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు సకాలంలో హాజరుకావాలని కోరారు. 
logo