ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 03, 2020 , 01:06:32

ఫైనాన్స్‌ బాగోతం

ఫైనాన్స్‌ బాగోతం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని పేదలు అవసరాలను అవకాశంగా ఎంచుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా ఫైనాన్స్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు బాకీ ఇస్తూ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  రాజమండ్రి, విజయవాడతో పాటు తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుం డా అక్రమంగా ఫైనాన్స్‌ దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానికంగా నివాసం ఉండే ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు పట్టణంలోని అద్దెకు ఉంటూ రో జు వారీగా బాకీలు ఇస్తూ వసూలు చేస్తుంటా రు.  ప్రధానంగా స్లమ్‌ ఏరియాల్లో నివసించే పేదలకు వీరు డబ్బులను బాకీ ఇస్తారు. పట్టణ శివారు ప్రాంతాలు రణధీవేనగర్‌, కేఆర్‌కే కాల నీ, తిర్పెల్లి, తాటిగూడ, కుర్షిద్‌నగర్‌, మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్‌, మావలతో పాటు ఉట్నూర్‌, తలమడగు, భీంపూర్‌, బేల మండలాల్లో వడ్డీవ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. రోజు వారీ కూలీలతో పాటు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వారికి వీరు డబ్బులు అప్పుగా ఇస్తారు. ఉదయం 5 గంటలు, సాయంత్రం 6 గంటల తర్వాత బాకీలు ఇవ్వడం, వసూలు చేయడం చేస్తారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు బాకీ ఇస్తారు. ఇందుకు గానూ వారి ఆధార్‌కార్డు, ఇతర ఐడీ ఫ్రూప్స్‌ బాకీ ఇచ్చేవారి వద్ద నుంచి తీసుకుంటారు. 


భారీగా వడ్డీ వసూలు.. 

పేదలు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులకు 25 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వారం ఏజెంట్లు వచ్చి డబ్బులు వసూలు చేసుకుని పోతారు. రూ.5 వేలు అప్పు కావాలనున్న వారికి వ్యాపారులు రూ.4900 ఇస్తారు. ఇందుకుగానూ వడ్డీతో కలిపి వారానికి  రూ.500 చొప్పున 12 వారాల లోపు మొత్తం రూ.6 వేలు చెల్లించాలి. రూ.10 వేలు అప్పు కావాలనుకునే వారికి రూ.9,800 ఇస్తారు. వీరు వారానికి రూ.1 వేయి చొప్పున పది వారాల్లో మొత్తం డబ్బులు చెల్లించాలి. గడువులోగా డబ్బులు చెల్లించని వారిని వేధింపులకు గురిచేయడంతో పాటు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారు స్థానికంగా నివాసం ఉంటూ ఆధార్‌ కార్డులను పొందుతారు. 


దాదాపు 40 మంది వరకు ఏజెంట్లు  స్థానికంగా ఉంటూ ఈ దందాను కొనసాగిస్తున్నారు. రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు బాకీ డబ్బులు వడ్డీతో పాటు వసూలు చేస్తారు. ఆంధ్ర, తమిళనాడు నుంచి వ్యాపారులు వచ్చి వారానికి ఇద్దరు వచ్చి కలెక్షన్‌ తీసుకుపోతారు. వ్యాపారులు వీరికి వాహనాలను సమకూరుస్తారు. వీటి ఆధారంగా మోటర్‌ సైకిళ్లను రిజిష్ర్టార్‌ చేసుకుంటారు. అక్రమంగా ఫైనాన్స్‌ దందా కొనసాగిస్తుడటంతో తరచూగా అద్దె ఇళ్లను మారుస్తుంటారు. ఎవరికి అనుమానం రాకుండా గట్టుచప్పుడుగా దందాను కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ ఫైనాన్స్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.   


logo