సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Feb 02, 2020 , 00:21:35

ఈ‘సారీ..’ నిరాశే

ఈ‘సారీ..’ నిరాశే
  • వేతన జీవులకు నిరాశ
  • ఆర్మూర్‌, ఆదిలాబాద్‌ రైలుమార్గానికి నిధులు లేవు
  • హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ ఉసే లేదు
  • వ్యక్తిగత ఆదాయ పన్ను ప్రతిపాదనలో మార్పులుఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్‌లో శనివారం 2020 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. సుమారు 2గంటల 45 నిమిషాలు ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో  ఉద్యోగులతో పాటు ఇతరులు ఆదాయపన్నును చెల్లిస్తుండగా కేంద్ర మంత్రి బడ్జెట్‌ ప్రసంగంతో ఆదాయపన్ను పరిమితి పెంచడానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కొత్త బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ సూచించిన విధంగా ఆదాయపన్ను చెల్లింపులు రెండు విధానాలు అమలు చేయనున్నారు. పాత, కొత్త విధానం అనేది పన్ను చెల్లింపుదారులు నిర్ణయించుకోవాలి. కొత్త విధానంలో మారితే మినహాయింపులు ఉండవు. పాత విధానంలో పన్ను మినహాయింపులు కొనసాగుతాయి. 


ఆదాయ పన్ను స్లాబ్‌లను మూడు నుంచి ఆరు స్లాబ్‌లకు పెంచారు. 0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.2.50 నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం ఆదాయపన్ను ఉంటుంది. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు ఉంటే 20 శాతం, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉన్న వారు రూ.25 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో 80సీ, 80డీ, ఎల్‌ఐసీ, హెచ్‌ఆర్‌ఏల రాయితీలు ఉండవు. స్టాండర్డ్‌ డిటక్షన్‌, బీమా ప్రీమియం, పీఎఫ్‌, పింఛన్‌ ఫండ్‌ల మినహాయింపులు ఉండవు. రూ. 5 లక్షల ఆదాయ ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోగా వీరు ఆదాయ పన్ను కింద వర్తించే రాయితీలు పొందడానికి అవకాశం ఉండదు. 


కారిడార్‌ ఊసే లేదు.

జిల్లాలో జాతీయ రహదారి  44 సుమారు 80 కిలోమీటర్ల మేర ఉంది. ఈ రహదారి పలు మండల కేంద్రాలు, గ్రామాల మీదుగా పోతుంది. ఈ రహదారికి కారిడార్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా నాయకులు పలుమార్లు కేంద్రాన్ని కోరారు. జాతీయ రహదారిపై పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. పలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. జిల్లాలోని పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు సైతం ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌ కారిడార్‌ ఏర్పాటు గురించి ఉసే లేకపోవడంతో జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రైలులో పోవాలంటే మహారాష్ట్రలోని వివిధప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు గానూ 9 నుంచి 10 గంటల సమయం పడతుంది. దీనిని నివారించడానికి 2009 -10 రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు వరకు లైన్‌ మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం రూ.3771 కోట్లు భారీగా అవుతుండడంతో తక్కువ ఖర్చతో ఆర్మూర్‌ లైన్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు లైన్‌ వేస్తే అక్కడి నుంచి నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు రైలులో పోయే అవకాశాలున్నాయి. దీంతో  2017 బడ్జెట్‌లో ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ లైన్‌కు మంజూరు లభించింది. లైన్‌ సర్వే నిర్వహించిన అధికారులు రూ.2990 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. ఈ రైల్వే లైన్‌కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని జిల్లా వాసులు ప్రతి బడ్జెట్‌లో ఎదురు  చూస్తున్న నిరాశ కలుగుతుంది. ఈ బడ్జెట్‌లో సైతం కేంద్ర ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైల్వే లైన్‌ ఎలాంటి నిధులు కేటాయించలేదు.


logo