గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Feb 01, 2020 , 04:05:53

కందుల కొనుగోళ్లకు సిద్ధం

కందుల కొనుగోళ్లకు సిద్ధం
  • ఆదివారం నుంచి నాఫెడ్‌ ఆధ్వర్యంలో 9 కేంద్రాలు
  • 2.22 లక్షల క్వింటాళ్ల సేకరణ లక్ష్యం
  • క్వింటాకు రూ.5800 మద్దతు ధర

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:   జిల్లాలో పత్తి తర్వాత సోయాబీన్‌, కంది పంటను ఎక్కువగా పండిస్తారు. పత్తి, సోయాబీన్‌లో అంతర పంటతో పాటు విడిగా కందిని రైతులు సాగు చేస్తారు. ఏటా వానాకాలం ప్రారంభంలో ఇతర పంటలతో కంది వేస్తుండగా ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. సీజన్‌ ప్రారంభం నుంచి ఈ పంట సాగుకు వర్షాలు బాగా పడడంతో పాటు, వాతావరణం అనుకూలించడంతో  పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు, సీజన్‌ ప్రారంభం నుంచి  ఈ పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించేందుకు అధికారులు పక్కా ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా నాఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది కంది క్వింటాకు రూ. 5800 మద్దతు ధర ప్రకటించగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఈ ధర చెల్లిస్తారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, బేల, తాంసి, ఇచ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, నార్నూర్‌ మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానుండగా ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల ద్వారా పంట కొనుగోళ్లు చేస్తారు.  గతేడాది కంది క్వింటాకు రూ.5675 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది రూ.125 పెరిగింది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు క్వింటాకు రూ.4800 వరకు చెల్లిస్తుండగా సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాకు రూ.1వేయి ఎక్కువ ధర లభించనుంది. ఆదివారం ఆదిలాబాద్‌, జైనథ్‌ మార్కెట్‌యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఈ కేంద్రాలను ప్రారంభిస్తారు.


2.22 లక్షల క్వింటాళ్ల సేకరణ లక్ష్యం

నాఫెడ్‌ ద్వారా జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా ఈ ఏడాది 2.22 లక్షల క్వింటాళ్ల పంటను సేకరించాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 9 మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సీజన్‌కు ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులు ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగుచేశారనే వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఈ వివరాలు ఆధారంగా మార్కెట్‌యార్డుల్లో రైతుల వద్ద నుంచి పంటను సేకరిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఉండగా వారు ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేస్తారు. గతంలో కందుల కొనుగోళ్లులో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. రెండేళ్లుగా అధికారులు తీసుకుంటున్న పకడ్బందీ చర్యల కారణంగా పంట కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయి. 


logo