ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 01, 2020 , 04:02:53

అట్టహాసంగా..‘అంతఃప్రజ్ఞ’

అట్టహాసంగా..‘అంతఃప్రజ్ఞ’

బాసర :బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించే గ్రామీణ సాంకేతిక పండుగ అంతఃప్రజ్ఞ-2020 కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వీసీ అశోక్‌కుమార్‌, ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ప్రశాంతి పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఐఏఎస్‌ ట్రైనీ అఖిల రాఘవేందర్‌, పర్వాతారోహణ శిక్షకుడు శేఖర్‌బాబు, డెల్‌ కంపెనీ సీనియర్‌ మెనేజర్‌ రఘురాం అంటోస్‌, సాఫ్ట్‌స్కిల్‌ శిక్షకుడు మనోహారన్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో చదివే గ్రామీణ పేద విద్యార్థులు దాదాపు ఈ అంతఃప్రజ్ఞలో 300కు పైగా నమూనాలను ప్రదర్శించారని, అంతే కాకుండా ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీయడానికి దోహదపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక్కడి విద్యార్థులకు అవగాహన ఉందన్నారు. ఆ సమస్యలను వారు నేర్చుకున్న సాంకేతిక విద్య ద్వారా పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలో కీలకమైందని, వ్యవసాయానికి సంబంధించిన ఆధునాతన సాంకేతిక యంత్ర పరికరాలను ప్రతి ఒక్కరితో ఉపయోగించి ఎక్కువ దిగుబడి రావడానికి వీలుగా విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇస్తున్నారని అన్నారు. జిల్లాలోని కోయ్యబొమ్మలను ప్రపంచంలోని ఏ మూల నుంచైనా కొనుగోలు చేయడానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా గతంలోనే విద్యార్థులు రూపొందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ లిటరసి కార్యక్రమంలో భాగంగా బాసరను మొట్టమొదటి డిజిటల్‌ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు కీలక పాత్ర పోశించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌ కూడా విద్యార్థులు నిర్వహించారన్నారు.


విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉంది

-ప్రశాంతి, కలెక్టర్‌ 

బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో చదివే విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అన్ని వేళలా పని నమూనాలను అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు ఉంటాయన్నారు. జిల్లాలోని వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను యూనివర్సిటీకి పంపించి పలు నమూనాలను పరిశీలించి వాటి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సూచనలను ఇవ్వాలని కోరుతామన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ నగరాల గురించే ఆలోచిస్తున్నారని కానీ స్మార్ట్‌ గ్రామీణం తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడ రూపొందించిన స్మార్ట్‌ విలేజ్‌ పలువురిని ఆకర్షించిందన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన పలువురు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్టార్టప్‌ స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, టీ-హబ్‌, వీ-హబ్‌ లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. 


logo