మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Feb 01, 2020 , 04:02:04

ఇన్నాళ్లు తేమ.. నేడు నాణ్యత

ఇన్నాళ్లు తేమ.. నేడు నాణ్యత

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : నిన్న మొన్నటి వరకు  తేమ పేరుతో ధరలో కోత విధించిన సీసీఐ మళ్లీ తెరపైకి కొత్త నిబంధన తీసుకువచ్చింది. మైక్‌వాల్యూ నాణ్యత లేమి రంగు మారిందంటూ ధరలో కోత విధిస్తున్నది. క్వింటా మద్ద ధర రూ. 5550 ఉండగా.. మైక్‌ వాల్యూ పేరిట రూ. 100 కోత విధిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు విడుదల చేశారు. దీంతో ఇకపై మద్దతు ధర రూ. 5450 చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యత పేరిట కొత్త కొర్రి..

పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి మొదట తేమ శాతం.. మధ్యలో పింజ శాతం.. ఇపుడు మైక్‌ వ్యాల్యూ అంటూ సీసీఐ అధికారులు పత్తి రైతును ఇబ్బందిపెట్టని సమయం లేదు. అసలే ప్రకృతి సహకరించక పంట దిగుబడి నష్టపోయిన రైతులను సీసీఐ అధికారుల నిబంధనలు మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. పత్తి ధర తగ్గించేందుకు సీసీఐ చేయని ప్రయత్నాలంటూ లేవు.   ఇపుడు మైక్‌ వ్యాల్యూ పేరిట మరో వివాదాన్ని సీసీఐ అధికారులు తెరపైకి తెచ్చారు. రంగు మారిందంటూ మద్దతు ధరలో 100 కోత విధిస్తుట్లు సీసీ ఏరియా మేనేజర్‌ మార్కెటిగ్‌ శాఖకు లేఖ రాయగా.. గురువారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 5 నుంచి క్వింటా పత్తికి మద్దతు ధర రూ. 5450 చెల్లిస్తున్నట్ల పేర్కొన్నారు. పత్తి దిగుబడులు చివరి దశకు చేరుతున్న తరుణంలో నాణ్యత దెబ్బ తింటోందనేది సీసీఐ అధికారులు వాదిస్తుంటే, అలాంటి పరిస్థితి జిల్లాలో లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


నిబంధనల ప్రకారం ఉన్నా కొనరా..?

సీసీఐ అధికారులు తీసుకొచ్చిన కొత్త నిబంధన మైక్‌ వ్యాల్యూ ఉన్న పత్తిని కూడా కొనడం లేదు. 3.1 మైక్‌ వ్యాల్యూ ఉన్న పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాకు రూ. 5550 వేలు, 9 శాతం ఉంటే రూ. 5494.50, 10 శాతం ఉంటే రూ. 5400. 39, 11 శాతం ఉంటే 5300.83, 12 శాతం ఉంటే రూ. 5300.28 ధర చెల్లించాల్సి ఉంటుంది.  ప్రతి 2 శాతానికి ఒకటి చొప్పున 3 కేటగిరీలుగా మైక్‌ వాల్యూను నిర్దారించారు. దీని ప్రకారం 3.3, 3.5 మైక్‌ వ్యాల్యూ పెరిగితే తేమ శాతాన్ని బట్టి ఎక్కువ ధర కల్పిస్తారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌ వంటి పెద్ద మార్కెట్‌లో జరుగుతున్న పత్తి విక్రయాల్లో సీసీఐ అధికారులు విధించిన మైక్‌ వ్యాల్యూను వాళ్లే పాటించని పరిస్థితి కనిపిస్తోంది. వాటిని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్‌ వ్యాపారులు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నారు. 


కలెక్టర్‌ చొరవతీసుకుంటే రైతులకు మేలు..

ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ, మరో వైపు ప్రైవేట్‌ వ్యాపారులు నానా పరీక్షలు పెడుతుండడంతో అన్నదాత అయోమయంలో ఉన్నాడు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ రైతుల శ్రేయస్సు దృష్ట్యా పత్తి కొనుగోళ్లు పారదర్శంగా నిర్వహించాలని, మైక్‌వాల్యూ విషయంలో సరిగ్గా వ్యవహరించాలని ఇదివరకే ఆదేశించారు.  సగటు పత్తి రైతు తన పంటను గ్రామాలకు వచ్చే దళారులకు కాకుండా నేరుగా ఆదిలాబాద్‌ మార్కెట్‌కే వచ్చి అమ్మకుంటున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విద్యావంతులైన రైతులు ఈ విషయమై ప్రశ్నిస్తే పై నుంచి ఆదేశాలు ఉన్నాయని దబాయిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు, కలెక్టర్‌, ఉన్నతాధికారులు  ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న అది రైతన్న పాలిట అందని ద్రాక్షే అవుతున్నది. కలెక్టర్‌ ఈ విషయంలో మళ్లీ చర్యతీసుంటే జిల్లాలో వేలాది మంది  పత్తి రైతులకు కొంత ఉరాట లబించేఅవకాశం ఉంది. 


logo
>>>>>>