గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 31, 2020 , 01:12:29

సరస్వతీ నమస్తుభ్యం..

సరస్వతీ నమస్తుభ్యం..
  • వైభవంగా వసంత పంచమి వేడుకలు
  • భారీగా అక్షరాభ్యాసాలు.. ప్రత్యేక పూజలు
  • భక్తజన సంద్రంగా మారిన బాసర క్షేత్రం

బాసర :చదువుల తల్లి బాసర సరస్వతీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. గురువారం వసంత పంచమి (శ్రీ పంచమి) వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జామున 2గంటల నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమవగా, భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో ఆలయం కిటకిటలాడింది. ఒక్క రోజే సుమారు 40వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. 


ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు..

రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంత్రిని ఆలయం తరపున సన్మానించి జ్ఞాపికలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం 6గంటలకు మహా విశేష పూజ, 7గంటలకు పల్లకీ సేవ, మహా హారతి, ద్వారా బంధనంతో ఉత్సవాలను ముగించారు. గోదావరి నదిలో సూర్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న మొదటి ఘాట్‌లో బాసర వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కేదారేశ్వర ఆశ్రమంలో మహా అన్నదానం చేశారు. బాసర ఆలయం తరపున నిత్యాన్నదాన సత్రంలోనూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వసంత పంచమి సందర్భంగా బాసర రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.


భారీ బందోబస్తు.. 

బాసరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌రాజు, భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, ముథోల్‌ సీఐ అజయ్‌బాబు, ఎస్సై కొదాడి రాజుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. భైంసా డివిజన్‌లోని ఆయా మండలాల ఎస్సైలు సైతం బందోబస్తులో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ నియంత్రణ చేశారు. బాసర ఎస్సై రాజు పోలీసులతో ఎప్పటికప్పుడు సమీక్షించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు బాసరకు రావడంతో పార్కింగ్‌ వద్ద వాహనాల సందడి కనిపించింది. 


logo