ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 31, 2020 , 01:03:56

సర్వత్రా న్యాయం ..సర్వత్రా హర్షం..

సర్వత్రా న్యాయం ..సర్వత్రా హర్షం..
  • 45 రోజుల్లోనే కోర్టు శిక్ష ఖరాలు
  • తప్పు చేసే వారికి తగిన గుణపాఠమనే అభిప్రాయం
  • నిందితులకు సరైన శిక్ష అంటున్న జనం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : కుమ్రంభీం జిల్లా జైనూర్‌లో ఉంటూ పరిసర గ్రామాల్లో  బోళ్లు అమ్ముకుంటూ ఉపాధి పొందే సమత గతేడాది నవంబరు 24న లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ గ్రామానికి పోయింది. బోళ్లు అమ్ముకుని తిరిగివస్తుండగా రాంనాయక్‌ తండా వద్ద కాపుకాసిని ఎల్లపటార్‌కు చెందిన ముగ్గురు మానవమృగాలు షేక్‌ బాబు(30), షేక్‌ షాబొద్దీన్‌ (40), షేక్‌ మగ్దూం(35) సమతను అడ్డగించి పొదల్లోకి తీసుకుపోయి లైంగికదాడికి పాల్పడ్డారు.  బాధితురాలు విషయం బయటపెడుతుందనే అనుమానంతో ఆమెను కత్తితో పొడిచి హత్యచేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు సమత మృతదేహాన్ని ఎల్లపటార్‌ శివారులో కనుగొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మగ్దూంలను అరెస్ట్‌ చేశారు . నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. సమత కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన 20 రోజుల్లో డిసెంబర్‌ 14న పోలీసులు కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు పనిరోజుల్లో రోజు వారీ విచారణ కొనసాగింది. ప్రత్యేక కోర్టులో కేసు విచారణ డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభంకాగా 45 రోజుల్లో జనవరి 30న తీర్పు వెలువడింది.


సర్వత్రా హర్షం..

సమత కేసులో సత్వర తీర్పు వెలువడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో దిశ ఘటన నేపథ్యంలో సమత కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించడంతో సంచలన తీర్పుగా మారింది. సమతా కేసులో సత్వర తీర్పు వెలువడడంతో ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమతను పాశవికంగా హత్యచేసిన నిందితులకు ఉరి సరైన శిక్ష అని.. ఎవరూ కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా  శిక్ష వారికి గుణపాఠం నేర్పుతుందనే పలువురు అంటున్నారు. ఈ తీర్పు సమాజం గెలుపుగా పీపీ రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాసిక్యూషన్‌ తరఫున బలమైన వాదనలు వినపించినట్లు పేర్కొన్నారు.  కేసు విచారణలో భాగంగా ప్రభుత్వానికి తాము రాసిన లేఖపై స్పందించి మూడ్రోజుల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని తాను శాస్త్రీయంగా సాక్షాలను కోర్టుకు సమర్పించడంతో పాటు సాక్షులను ప్రవేశపెట్టామని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. 


logo