బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 30, 2020 , 00:16:38

అతివలదే.. ఆధిపత్యం

అతివలదే.. ఆధిపత్యం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మహిళలే మహరాణులుగా నిలిచారు. మరోసారి అతివలదే ఆధిప త్యం కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు.. రిజర్వు స్థానాల కన్నా ఎక్కువ మంది మహిళలు కౌన్సిలర్లుగా గె లిచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12మున్సిపాలిటీలు ఉండగా.. ఇందులో మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు ని ర్వహించలేదు. ఇక్కడ 1/70యాక్టు అమలులో ఉండగా.. వివాదం కోర్టుకు చేరడంతో ప్రత్యేకాధికారి పాలనలో నడుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 11 చోట్ల ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించగా 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 11మున్సిపాలిటీలకుగాను.. పది చోట్ల టీఆర్‌ఎస్‌ పురపీఠాలను దక్కించుకోగా.. ఒక్క భైం సాను మాత్రమే ఎంఐఎం కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 11 పుర పాలక సంఘాల్లో మొత్తం 309వార్డులు ఉం డగా.. వీటిలో 50శాతం మహిళలకు రిజర్వు చేశారు. దీంతో మొత్తం 153వార్డులను మహిళలకు రిజర్వేషన్‌ చేయగా.. మిగతా 156వార్డులను జనరల్‌ స్థానాలుగా ఉంచారు. 153వార్డుల్లో పూర్తిగా మహిళలే పోటీ చేసేందుకు అవకాశం కల్పించగా.. మిగతా జనరల్‌ స్థానాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. 


పోలింగ్‌లోనే కాదు.. సీట్లలోనూ వారే..

ఓటర్లలోనే కాదు.. పోలింగ్‌లోనూ తామే ముందున్నామని నిరూపించారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళలు 2059మంది ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్నారు. నిర్మల్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో పురుషులకన్నా మహిళలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల, నస్పూర్‌, క్యాతన్‌పల్లి, భైంసా మున్సిపాలిటీల్లో మహిళల కన్నా పురుషులు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా వచ్చిన ఫలితాల్లోనూ వారిదే పైచేయి కొనసాగింది. 


పురుషుల కన్నా మహిళ కౌన్సిలర్లే ఎక్కువ..

ఉమ్మడి జిల్లాలో మరోసారి మహిళలు తమ సత్తాను చాటారు. ఇటీవల ప్రకటించిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. రిజర్వు స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో పురుషులకన్నా మహిళలు ఏడుగురు మంది ఎక్కువ కౌన్సిలర్లు గెలిచారు. ఉమ్మడి జిల్లాలో 158మంది మహిళలు కౌన్సిలర్లుగా గెలుపొందగా.. పురుషులు 151మంది కౌన్సిలర్లుగా గెలిచారు. వాస్తవానికి మహిళలకు 153వార్డులను రిజర్వు చేయగా.. ఐదు జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేసి మహిళలు విజయం సాధించడం విశేషం. రిజర్వు స్థానాలకన్నా ఐదు స్థానాలు ఎక్కువగా గెలిచారు. జనరల్‌ స్థానాలు 156 ఉండగా.. 151మంది పురుషులు కౌన్సిలర్లుగా గెలిచారు. కాగజ్‌నగర్‌లో రెండు వార్డులు, మంచిర్యాలలో ఒకవార్డు, బెల్లంపల్లిలో రెండు వార్డుల్లో జనరల్‌ స్థానాల్లో మహిళలు పోటీ చేసి విజయం సాధించారు. 


రెండు రిజర్వు.. నాలుగు చోట్ల చైర్‌పర్సన్లు..

మరోవైపు జిల్లాలో రెండు చోట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులు మహిళలకు రిజ ర్వు చేయగా.. నాలుగు చోట్ల మహిళలు మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకున్నారు. జనరల్‌ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ జనరల్‌ రిజర్వు చేయగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జంగంకళ (ఎస్సీ మహిళ)ను మున్సిపల్‌ చైర్‌పర్సన్లుగా ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జక్కుల శ్వేత (ఎస్సీ మహిళ)కు అవకాశం కల్పించారు. ఇక చెన్నూర్‌ మున్సిపాలిటీ జనరల్‌ మహిళకు కేటాయించగా.. ఇక్కడ అర్చనగిల్డా (టీఆర్‌ఎస్‌), భైంసా మున్సిపాలిటీకి బీసీ మహిళకు కేటాయించగా.. సబియాబేగం (ఎంఐఎం)చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

జనరల్‌ స్థానాల్లో గెలిచింది వీరే...

కాగజ్‌నగర్‌లో 27వ వార్డు ఎస్సీ జనరల్‌ కాగా.. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పంబాల సుజాత (ఎస్సీ), 12వ వార్డు ఎస్టీ జనరల్‌ కాగా.. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి శశికళ (ఎస్టీ) గెలిచారు. మంచిర్యాలలో 33వ వార్డు అన్‌రిజర్వుడ్‌ (జనరల్‌) స్థానం కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి జగ్గరి సుమతి విజయం సాధించారు. బెల్లంపల్లిలో 21వ వార్డు ఎస్సీ జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి రాజనాల కమల (ఎస్సీ), 28వ వార్డు బీసీ జనరల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి సరిత (బీసీ) గెలుపొందారు. 


logo
>>>>>>