బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 30, 2020 , 00:15:21

పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన లోపం

పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన లోపం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సర్వీస్‌మెన్‌లు, విదేశాల్లో ఉన్న వారికి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. బ్యాలెట్‌ ఓట్ల వినియోగంపై అవగాహన లోపమో.. మరేమో తెలియదు కానీ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు పూరించడంలో చిన్న చిన్న తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈసీ నిబంధనల మేరకు కౌంటింగ్‌ అధికారులు ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తిరస్కరిస్తున్నారు. సాధారణ ఎన్నికలతోపాటు బల్దియా ఎన్నికల్లో సైతం సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. 485 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకోగా.. కౌంటింగ్‌లో అధికారులు 150 బ్యాలెట్‌ ఓట్లను తిరస్కరించారు.


పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తులు

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బల్దియా ఎన్నికల్లో పోలింగ్‌ సిబ్బందితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డవారు, చదువుల నిమిత్తం ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు, సర్వీస్‌ఓటర్లు మొత్తం 485 మంది దరఖాస్తు చేసుకున్నారు. 22న జరిగిన ఎన్నికల్లో కొంత మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయగా.. మరికొంత మంది సర్వీస్‌ ఓటర్లు, విదేశాల్లో ఉన్నవారు ఆన్‌లైన్‌ ద్వారా తమ ఓటుహక్కును వినిమోగించుకున్నారు. 335 ఓట్లు చెల్లుబాటు కాగా.. 150 ఓట్లను అధికారులు తిరస్కరించారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో 2,633 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 2,545 ఓట్లు చెల్లగా, 74 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 2216 మంది ఎన్నికల ఉద్యోగులు, పోలీసులు, సర్వీస్‌ ఓటర్లు 24 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అందులో 146 బ్యాలెట్‌ ఓట్లు రిజక్ట్‌ అయ్యాయి. ఎన్నికల్లో సామాన్యులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటుండగా ఎన్నికల విధులు లేదా.. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు పోస్ట్‌ బ్యాలెట్‌ వాడుకుంటున్నా కొన్ని ఓట్లు చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులతో నిరంతర అవగాహనతో సాధారణ, ఇతర ఎన్నికల్లో ప్రజలు శ్రద్ధగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో అటు పోలింగ్‌ శాతం పెరగడం, చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య తగ్గుతున్నది. ఈ క్రమంలో విద్యావంతులైన ఉద్యోగులు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అవగాహన రాహిత్యంతో ఓట్లు చెల్లుబాటు కావడం లేదు. 


అవగాహన లోపమేనా ?

గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జిల్లా ఎన్నికల అధికారి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలీసు సిబ్బందికి వేర్వేరుగా శిక్షణను సైతం ఇచ్చారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ రిజక్ట్‌ కావడానికి కారణాలు 13 సీలో నియోజకవర్గం నంబరు, పేరు, రిటర్నింగ్‌ అధికారి చిరునామా రాయాల్సి ఉంటుంది. 13ఏలో ఎవరైతే ఉద్యోగి కానీ, సర్వీస్‌ ఓటర్లు కానీ, ఇతర దేశాల్లో ఉన్నవారు డిక్లరేషన్‌ నింపాల్సి ఉంటుంది. పూర్తి చిరునామా వివరాలతోపాటు గెజిటెడ్‌ అటాచ్‌డ్‌ సంతకం తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. 13బీలో బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుంది. ఈ పేపర్‌పై ఆయా వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులు ఉంటాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునే వారు ఎంపిక చేసుకున్న అభ్యర్థికి ఇంటూ మార్కు లేదా టిక్‌ మార్కు చేయాల్సి ఉంటుంది. సంతకం కానీ, ఇతర పెన్నుగీతలు ఏమైనా ఉంటే ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు తిరస్కరిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై సోషల్‌ మీడియా ద్వారా, జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి శిక్షణను సైతం ఇచ్చారు. కొంత మంది ఎన్నికల సిబ్బంది, సర్వీస్‌ ఓటర్లు, విదేశాల్లో ఉన్నవారు ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై అవగాహన లేక పోవడంతోనే ఓట్లు తిరస్కరణకు గురవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.


logo
>>>>>>