మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 30, 2020 , 00:06:08

గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట

గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట
  • పోడు భూముల సమస్యకు త్వరలో పరిష్కారం
  • నాగోబా ఆలయాభివృద్ధికి రూ.13.75 కోట్లు
  • చదువుతోనే ప్రగతి సాధ్యం
  • నాగోబా దర్బార్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర  దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం కెస్లాపూర్‌ నాగోబాను దర్శించుకున్న ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజాదర్బార్‌లో పాల్గొని మాట్లాడారు. జాతరలో దర్బార్‌ నిర్వహించడంతో గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అధికారులు శాఖల వారీగా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగోబా ఆలయ నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.13.75 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.5 కోట్లు ఆలయ నిర్మాణానికి, ప్రహరీ, ప్రాకారం మండపం నిర్మాణం కోసం రూ.1.25 కోట్లు, రాజగోపురం కోసం రూ.20 లక్షలు, మరో రాజగోపురం కోసం రూ.1.20 కోట్లు, ఆర్చ్‌ కోసం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. రూ.1 కోటితో దర్బార్‌ నిర్మాణం పూర్తయిందని, అదనంగా నిర్మాణం కోసం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కెస్లాపూర్‌కు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా రూ.1.80 కోట్లతో బీటీ రోడ్డు, మందపల్లి రోడ్డుకు రూ.1.50 కోట్లు, రూ.1 కోటితో మినీ స్టేడియం, రూ.60 లక్షలతో కాంపౌండ్‌ వాల్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. కుమ్రంభీ జిల్లా జోడేఘాట్‌ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. గిరిజన యువతకు వివిధ ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నామని, వాటిని సద్వినియోగపర్చుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యను అందిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపి బాగా చదివించాలన్నారు.

పోడు భూముల సమస్య పరిష్కారం 

గిరిజన ప్రాంతాల్లోని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తర్వలో పరిష్కరిస్తారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబాబ్‌నగర్‌ జిల్లాలో సమస్య ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించి త్వరలో ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారన్నారు. అడవులను కాపాడాల్సిన బా ధ్యత అందరిపైనా ఉందన్నారు. మొక్కల పెంపకంతో ప ర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, గ్రామాల్లో పచ్చదనం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉపాధి కల్పిచేందుకు జీసీసీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేస్తున్నామని ఉట్నూర్‌, ఇంద్రవెల్లిలో కొత్తగా బంకులను ప్రారంభిస్తామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 11 పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని వ్యాధులపై సమగ్రంగా పరిశీలన జరిపేందుకు వైద్య నిపుణులతో కూడిన బృందాలను పంపించి సర్వే చేపడుతామన్నారు. రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిపా రు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత నీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులను ఆ ప్రాంతాలకే వినియోగిస్తున్నామని తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ సోయం

దర్బార్‌లో గిరిజనులు అందజేసిన దరఖాస్తులను అధికారులు పరిష్కరించాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించాలని, క్రమం తప్పకుండా బడికి పంపాలని సూచించారు. ఆదివాసులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ దివ్య, ఎస్పీ విష్ణు వారియర్‌, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.


logo
>>>>>>