శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 , 00:26:55

కల్లోల ‘కమలం’

కల్లోల ‘కమలం’

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:కమలం పార్టీలో ముసం మొదలైంది. బీజేపీలో మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వర్గ పోరు రాజుకున్నది. పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలను చూపుతూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిపై అధిష్టానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమ పదవులకు రాజీనామాలు చేసి కార్యకర్తలుగా కొనసాగుతామని పలువురు నాయకులు తెలిపారు. సుహాసిని రెడ్డి వ్యాఖ్యలను పార్టీలో కొందరు నాయకులు తప్పుపడుతున్నారు.

ముదిరిన వర్గ పోరు..

మున్సిపల్‌ ఎన్నికల్లో 49 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 11 వార్డుల్లో గెలిచింది. మున్సిపల్‌ ఫలితాలు కమల పార్టీలో కల్లోలం సృష్టించాయి. ఫలితాలు వెలువడిన రెండ్రోజుల తర్వాత ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమికి పాయల్‌ శంకర్‌ కారణమని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కోసం కోర్‌ కమిటీని ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షుడు ఇష్టం వచ్చిన వారికి బీ ఫారాలు ఇచ్చారన్నారు. పార్టీల పనిచేసిన వారు, ప్రజాదారణ పొందిన వారిని గుర్తించి టికెట్లు ఇవ్వాలని అధిష్టానం సూచించినా పట్టించుకోలేదని తెలిపారు. తాము ఎంపీ సోయం బాపురావు నాయకత్వంలో పనిచేస్తామని పదవులకు రాజీనామా చేసి కార్యకర్తలుగా కొనసాగుతామన్నారు. ఢిల్లీకి వెళ్లి జిల్లా అధ్యక్షునిపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సుహాసిని రెడ్డి వ్యాఖ్యలపై ఖండన

సుహాసిని రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కొందరు నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా నాయకులు వ్యవహరించడం సరికాదని నాయకుడు నగేశ్‌ అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమ్ముడుబోయారని వ్యాఖ్యలు చేయడం పార్టీకి మంచిది కాదన్నారు. ఆరోపణలు చేసిన వారు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినట్లు తాము భావిస్తున్నామన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకే మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చామన్నారు. పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు ఎంలాటి పరిస్థితులకు దారితీస్తాయోనని చర్చించకుంటున్నారు.


logo