మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 , 00:22:54

ప్రజల భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధి

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రజల భాగస్వామ్యంతో ఆదిలాబాద్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం మున్సిపాలిటీలో గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. పునర్విభజనలో భాగంగా మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో సేకరించిన చెత్తను రీసైక్లింగ్‌ చేసేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?

జోగు ప్రేమేందర్‌ : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ పట్టణాభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి సాధించింది. కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రహదారులు, మురికికాల్వలు నిర్మించాం. వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాం. పట్టణాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతో చర్చించి ప్రణాళికలు తయారు చేస్తాం. ప్రజల భాగస్వామ్యంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. పట్టణంలో పచ్చదానాన్ని పెంపొందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.

సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?

మున్సిపల్‌ పరిధిలోని ప్రజల సమస్యలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా ప్రతి వారం మున్సిపాలిటీలో గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటాం. అవకాశం ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేస్తాం. మిగితా సమస్యల పరిష్కారం కోసం సైతం పరిష్కరిస్తాం

కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు, సభ్యులకు అవగాహన కల్పిస్తారా ?

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా పట్టణాలతోపాటు ప్రజల అభివృద్ధి జరుగుతుంది. ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. చట్టంలోని అంశాలు, విధివిధానాలపై ప్రజలు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం

విలీన వార్డుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?

గతంలో గ్రామ పంచాయతీల్లో ఉండి మున్సిపాలిటీల్లో విలీనమైన వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. కేఆర్కే కాలనీ, అనుకుంట, బంగారుగూడ, ధోబీ కాలనీ, బెల్లూరి, టీచర్స్‌ కాలనీ, సుభాష్‌నగర్‌, కైలాస్‌ నగర్‌ ప్రాంతాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందాయి. మిగితా వాటిపై సైతం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడుతాం. 

ప్లాస్టిక్‌ వాడకం నిరోధానికి ఏం చేయాలనుకుంటున్నారు ?

ప్లాస్టిక్‌ నిషేధంపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి ప్రత్యామ్నాయ మార్గాలను తెలియజేస్తాం. పట్టణంలోని దుకాణాలు, తోపుడు బండ్లు, ఇతర విక్రయ కేంద్రాల్లో కవర్లు వాడకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూట్‌ బ్యాగులను పంపిణీ చేస్తున్నాం. ఇండ్లలో సేకరించిన చెత్తను రీసైక్లింగ్‌ చేయడానికి కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తాం.

యువతకు ఉపాధి కల్పించేందుకు ఏమైన ప్రణాళికలు ఉన్నాయా ?

జోగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా యువతకు కంప్యూటర్‌, కుట్టు, మగ్గం వర్క్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఇతర ఉపాధి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. వివిధ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇప్పటి వరకు 800 మందికి ఉద్యోగులు కల్పించాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాం.


logo