శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:32:27

బల్దియా టీఆర్‌ఎస్‌దే..

బల్దియా టీఆర్‌ఎస్‌దే..

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి సోమవారం జరిగిన చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో రెండు పదవులకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. చైర్మన్‌గా 34వ వార్డు కౌన్సిలర్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌గా 29వ వార్డు కౌన్సిలర్‌ జహీర్‌ రంజానీ ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్‌కు చెందిన 24 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఎన్నికలు జరిగే మున్సిపాలిటీ కౌన్సిల్‌ మందిరానికి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు వచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. మొత్తం 49 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి చేరుకున్న కౌన్సిలర్లతో జేసీ ప్రమాణస్వీకారం చేయించారు. ఎక్కువ మంది సభ్యులు తెలుగులో ప్రమాణస్వీకారం చేయగా కొందరు హిందీలో, మరికొందరు ఇంగ్లిషు, ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. 49 మంది ప్రమాణస్వీకారం అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు జాయింట్‌ కలెక్టర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనలు ఆమె సభ్యులకు వివరించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎంపీ సోయం బాపురావు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్‌ కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్య 51కి చేరింది. ఎమ్మెల్యే జోగు రామన్న హాజరుకాగా ఎంపీ సోయం బాపురావు గైర్హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించాలంటే 50 శాతం కోరం అనగా 26 సభ్యులు అవసరం కాగా వందశాతం కోరం ఉండడంతో జేసీ ఎన్నికల ప్రక్రయను ప్రారంభించారు.

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ఏకగ్రీవం

మధ్యాహ్నం చైర్‌పర్సన్‌గా ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకాగానే సభ్యులు తమ వార్డు అభ్యర్థులను ప్రతిపాదించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా జోగు ప్రేమేందర్‌ పేరును 45వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండారి సతీశ్‌ ప్రతిపాదించగా, 12వ వార్డు సభ్యుడు పవన్‌నాయక్‌ బలపర్చారు. ప్రతిపక్షాల నుంచి ఎవరూ చైర్మన్‌ పదవి కోసం ముందుకు రాకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం సభ్యులు ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు. దీంతో చైర్మన్‌ పదవికి పోటీ లేకుండా ఏకగ్రీవం అయ్యింది. దీంతో చైర్మన్‌గా జోగు ప్రేమేందర్‌ ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. వైస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన 29వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ జహీర్‌ రంజానీ పేరును 33వ వార్డు సభ్యుడు అలాల అజయ్‌ ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యుడు ఉష్కం రఘుపతి బలపర్చారు. ప్రతిపక్షాల నుంచి వైస్‌ చైర్మన్‌కు సైతం ఎవరూ పోటీ పడలేదు. దీంతో వైస్‌ చైర్మన్‌గా జహీర్‌ రంజానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై టీఆర్‌ఎస్‌ సభ్యులు చప్పట్లతో వారికి అభినందనలు తెలిపారు.

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ప్రమాణస్వీకారం

మున్సిపల్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జోగు ప్రేమేందర్‌, జహీర్‌ రంజానీలతో జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేయించారు. ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎమ్మెల్యే జోగు రామన్న పక్కన ఉన్నారు. అనంతరం రిజిష్టర్‌లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. వీరిని టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు అభినందించారు. ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ తన తండ్రి జోగు రామన్న ఆశీర్వాదం తీసుకున్నారు. 

నాయకుల అభినందనలు 

ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్‌ చాంబర్‌లో తన సీట్లో ఆసీసులైన జోగు ప్రేమేందర్‌ను పలువురు అభినందించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎ మ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, డీ సీసీబీ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి అభినందించారు. మత పెద్దలు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లకు ఆశీస్సులు అందజేశారు. చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ చాంబర్‌ లో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబసభ్యులు, నాయకులు చైర్మన్‌ ప్రేమేందర్‌కు మిఠాయిలు తినిపించి సంబురాలు పంచుకున్నారు. విజయోత్సవ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


logo