మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:33:18

దారులన్నీకెస్లాపూర్‌కే..

దారులన్నీకెస్లాపూర్‌కే..
  • గోవాడ్‌లో కొనసాగుతున్న పూజలు
  • నాగోబాను దర్శించుకున్న పలువురు ప్రముఖులు

ఇంద్రవెల్లి : మెస్రం వంశీయుల మహాపూజలతో మొదలైన కెస్లాపూర్‌ నాగోబా జాతర భక్తజనంతో కిటకిటలాడింది. సోమవారంతో కెస్లాపూర్‌ నాగోబా జాతర మూడో రోజుకు చేరుకోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాలు, హోటళ్లు సందడిగా కనిపించింది. నాగోబాను దర్శించుకొని భక్తులు జాతరలో వస్తువులను కొనుగోలు చేస్తూ బిజిబిజీగా కనిపించారు.

నాగోబాను దర్శించుకున్న ఏఎస్పీ దంపతులు

ఆదివారం రాత్రి ఉట్నూర్‌ ఏఎస్పీ శబరీష్‌ దంపతులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి గోవాడ్‌ను సందర్శించి బేటింగ్‌ అయిన కొత్తకోడళ్లు నిర్వహిస్తున్న సంప్రదాయ పూజలను తిలకించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, సీఐ నరేశ్‌ కుమార్‌, ఎస్సై గంగారాం, మెస్రం వంశీయులు నాగ్‌నాథ్‌, మనోహర్‌, చిన్ను పటేల్‌, తిరుపతి పాల్గొన్నారు.


సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యం

కెస్లాపూర్‌ నాగోబా జాతరను పురస్కరించుకొని మండలంలోని సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కినక జుగాదిరావ్‌ మాట్లాడుతూ.. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతరలో తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు.


వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌

నాగోబా జాతరను పురస్కరించుకొని కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాహనాల కోసం అధికారులు ప్రత్యేకంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. నాగోబా జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు అన్ని రకాల బస్సులను కెస్లాపూర్‌ మీదుగానే నడిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని బస్సులు కెస్లాపూర్‌ నాగోబా జాతరకు వచ్చిపోతున్నాయి. 


నాగోబాను దర్శించుకున్న కోదండరాం

కెస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జాతరను పురస్కరించుకొని నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకుడు ఆత్రం భుజంగ్‌రావ్‌ తదితరులు ఉన్నారు.


logo