గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 27, 2020 , 23:25:33

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో 31వ రోడ్డు భద్రత వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. మొదట కలెక్టర్‌ రోడ్డుభద్రతపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం శక్తివంతమని, దేశంలోని యువతపై రోడ్డు భద్రత బాధ్యత ఉన్నదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో గతంతో పోలిస్తే జిల్లాలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. భారత దేశంలో అన్ని రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడులో ప్రమాదాల శాతం తగ్గిందని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించని వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి చికిత్స అందించడానికి సకాలంలో దవాఖానల్లో చేర్చడానికి 108కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలీస్‌ కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువ శాతం మృత్యువాత పడుతున్నారని, తలకు హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలతో బయట పడేవారని చెప్పారు. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని తెలిపారు. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్‌, రవాణా శాఖల అధికారులు తమవంతు కృషి చేస్తున్నారని వివరించారు. జిల్లా ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ విష్ణు వారియర్‌, జిల్లా రవాణాశాఖ అధికారి పుప్పాల శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గోపి, ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo