శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 26, 2020 , 02:05:24

ఎగిరిన గులాబీ జెండా

ఎగిరిన గులాబీ జెండా
  • - ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కైవసం
  • - 24 వార్డుల్లో విజయం
  • - రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
  • - ప్రజల ఆదరణ కోల్పోయిన ప్రతిపక్షాలు
  • - 11 స్థానాల్లో బీజేపీ, చెరి ఐదు వార్డుల్లో కాంగ్రెస్‌, ఎంఐఎం విజయం
  • - ఇండిపెండెంట్‌లకు 4 స్థానాలు

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులకు ఈ నెల 22న పోలింగ్‌ జరుగగా 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది. బ్యాలెట్‌ బాక్స్‌లను టీటీడీసీలో స్ట్రాంగ్‌రూంలలో భద్రపర్చారు. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకోసం మూడు గదులను ఏర్పాటు చేశారు. రెండు గదుల్లో 6 టేబుళ్లు, మరో గదిలో 4 టెబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ నిర్వహించారు. ప్రతి టెబుల్‌లో మూడు వార్డుల చొప్పున ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించారు. అనంతరం వార్డుల్లో పోలైన ఓట్లను కౌంట్‌ చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగడంతో ఫలితాల వెలువడండలో తీవ్ర జాప్యం జరిగింది. మధ్యా హ్నం 12.30 గంటల మొదటి రౌండ్‌లో భాగంగా 16 వార్డుల ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 5 వార్డుల్లో, బీజేపీ 5 వార్డులు, కాంగ్రెస్‌ 2 వార్డులు, ఎంఐఎం 2 వార్డులు, ఇండిపెండెంట్‌లు రెండు వార్డుల్లో విజయం సాధించారు. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 7 వార్డులు, బీజేపీ 3 వార్డులు, కాంగ్రెస్‌ 2, ఎంఐఎం 2, ఇండిపెండెంట్‌లు 2 వార్డుల్లో గెలుపొందారు. మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. 16 వార్డులకు గానూ టీఆర్‌ఎస్‌ 11 వార్డులు, బీజేపీ 3, ఎంఐఎం 1, కాంగ్రెస్‌ 1 వార్డులో విజయం సా ధించాయి. నాలుగో రౌండ్‌లో ఒకే వార్డుకు సంబంధించి న ఓట్లను లెక్కించగా ఆ వార్డులో సైతం టీఆర్‌ఎస్‌ అభ్య ర్థి విజయం సాధించారు. దీంతో మొత్తం నాలుగు రౌండ్లు ముగిసే టీఆర్‌ఎస్‌ 24 వార్డులు, బీజేపీ 11, కాంగ్రెస్‌, 5, ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌లు 4 వార్డుల్లో గెలుపొందారు.

మున్సిపాలిటీపై గులాబీ జెండా

మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యే జోగు రామన్న వేసే ఎక్స్‌ అఫిషియో ఓటుతో టీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ మున్సిపాలిటీపై రెండోసారి గులాబీ జెండాను ఎగురువేయనున్నది. 2014 జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పట్టణంలో పలు వార్డులతో పాటు ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల్లో సైతం గులాబీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీని ఆదరించి అభ్యర్థులను ఆశీర్వదించారు. పలువార్డుల్లో గెలుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు, వారి అనుచరులు కౌంటింగ్‌ కేంద్రాల నుంచి నిరాశతో వెనుదిరిగారు.

టీఆర్‌ఎస్‌ సంబురాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు సాధించడంపై టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు జరపుకొన్నారు. పటాకులు పేల్చుతూ, నినాదాలతో హోరెత్తించారు. ఈ సంబురాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, జడ్పీటీసీలు, ఎంపీపీలు నాయకులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు గెలిపించాయి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజల ఉపాధి మెరుగుపడింది. ప్రతిపక్షాల నాయకులు ఏమి చెప్పిన ప్రజలు పట్టించుకోకుండా టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఓట్లు వేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదపడ్డాయి. గులాబీ పార్టీని గెలిపించినందుకు ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తాం.
- జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా పథకాలు

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి పథకాలు అన్ని  వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు పూర్తిగా విశ్వాసం తో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో జిల్లా ఎంతో అభివృద్ధి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై సైతం ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది. దీంతో జిల్లాలో ఎలాంటి ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుంది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది. సర్కారు అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నారు.
-లోక భూమారెడ్డి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి


logo