సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 26, 2020 , 02:04:03

పకడ్బందీ వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ఘన విజయం..

  పకడ్బందీ వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ఘన విజయం..
  • -ప్రత్యేక దృష్టి నిలిపిన ఎమ్యెల్యే..
  • - పడిన కష్టానికి దక్కిన ఫలితం..


ఆదిలాబాద్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఆదిలాబాద్‌ మున్సిపాలిటి ఎలాగైన దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్‌ ఎమ్యెల్యే జోగు రామన్న ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు. వార్డుల వారీగా ప్రత్యేకంగా మీటింగ్‌లు ఏర్పాటు చేసి గెలుపు గుర్రాలకే టికెట్లు వచ్చేలా చూశారు. వార్డుల్లో ఎవరు టికెట్‌ ఇస్తే గెలుస్తారనే విషయాలను ఎప్పటి కపుడు ఇంటలిజెన్స్‌, స్థానిక నాయకులు, తనకు తెలిసిన సీనియర్‌ కార్యకర్తల ద్వారా సమాచారం తెప్పించుకుంటూ ముందుకు సాగారు. పార్టీ బీ ఫారాలు, అభ్యర్థుల ఎంపికలో ఎవరికి అంతుచిక్కకుండా వ్యూహాన్ని అమలు చేశారు. పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే కచ్చితంగా విజయం సాధిస్తారనే వారికి మాత్రమే పార్టీ భీ ఫారాలు అందించారు. అంతే కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించగానే అసమ్మతివచ్చినప్పటికి అనేక మంది రెబెల్‌ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా చూశారు. అంతా తానై అధిష్టానాన్ని ఒప్పించి చైర్మన్‌ పదవిని దక్కించుకునేలా గెలుపుకోసం అంతా తానై వ్యవహరించారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న జడ్పీ చైర్‌పర్సన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, బోథ్‌ ఎమ్యెల్యే రాథోడ్‌ బాపూరావ్‌, మాజి ఎంపీ గోడం నగేష్‌లతో పాటు వివిధ మండలాల నాయకులు తుల శ్రీనివాస్‌ తదతరులను రంగంలోకి దింపి వార్డుల వారిగా వారికి గెలుపు బాధ్యతలను అప్పగించారు. ప్రచారానికున్న తక్కువ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కౌన్సిలర్‌ అభ్యర్థులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రచారం చేశారు. అంతే కాకుండా తాను మంత్రిగా ఉన్న సమయంలో మున్సిపాలిటీ అభివృద్ది కోసం సీఎం నుంచి తెచ్చిన కోట్లాది రూపాయల నిధుల ద్వారా అన్ని వార్డులను అభివృద్ధి చేసింది వారికి గుర్తు చేశారు. గెలుపులో వెనుకంజ వేస్తారని అనుమానమున్న కాలనీల్లో ప్రత్యేకంగా ఇంటింటికి తిరుగుతూ, రోడ్‌షోలు నిర్వహిస్తు ముమ్మర ప్రచారం నిర్వహించారు. బడానాయకులు ఎవరూ రాకపోయిన అంతా తానై ఎమ్యెల్యే ఎప్పటికపుడు కౌన్సిలర్‌ అభ్యర్థులకు సూచనలిస్త్తూ ప్రచారంలో ముందుకు సాగేలే చూశారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో నేడు టీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 24స్థానాలు సాధించి ఘన విజయం సాదించేలా కృషి చేశారు.


logo