సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 26, 2020 , 02:03:18

అన్ని శాఖల సమష్టి కృషి

అన్ని శాఖల సమష్టి కృషి
  • ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :
బల్దియా ఎన్నికల నిర్వహణలో అధికార యం త్రాంగం విజయవంతమైంది. ఎన్నికల షడ్యూల్‌ వెలువడిన తర్వాత వార్డుల పునర్విభజన, కులాల వారీగా ఓటరు గణన చేపట్టింది. నిర్ణీత గడువులోగా.. అధికార యంత్రాంగం ప్రక్రియను పూర్తిచేసి ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. ఎన్నిల నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లను చేసింది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న చెదుముదురు ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇద్దరు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎనిమిది పీఎస్‌లకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి మొబైల్‌ టీంల ద్వారా పెట్రోలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఎస్పీ విష్ణువారియర్‌ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సలహాలు సూచనలు ఇచ్చారు. 22న బల్దియా పరిధిలోని 49 వార్డులకు జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. శనివారం స్థానిక టీటీడీసీలో కౌంటింగ్‌ నిర్వహించగా అభ్యర్థులతో పాటు అభిమానులు, కౌంటింగ్‌ ఏజెంట్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పోలీసు శాఖ మూండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేసి ర్యాలీలు, సంబురాలను నిషేధించారు. మొత్తానికి అన్ని శాఖల అధికారుల సమస్టి కృషితో బల్దియా ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
logo