మంగళవారం 07 ఏప్రిల్ 2020
Adilabad - Jan 26, 2020 , 02:02:12

నిఘా నీడలోఎన్నికల ఫలితాలు

నిఘా నీడలోఎన్నికల ఫలితాలు
  • -కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
  • -బందోబస్తులో 400 మంది పోలీసులు


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికల ఫలితాలు నిఘానీడలో కొనసాగాయి. వార్డల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బ్యాక్సుల సీల్‌ విప్పి ఒక్కో బ్యాలెట్‌ పేపర్‌ను చూపిస్తూ గుర్తుల వారీగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేశారు. 25 బ్యాలెట్‌ ఓట్లకు ఒక బండల్‌ కట్టి ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించారు. 16 వార్డులకు ఒక రౌండు చొప్పున మూడు రౌండ్లను ఏర్పాటు చేశారు. సమీప అభ్యర్థులపై మెజార్టీ సాధించిన అభ్యర్థులు గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.

మూడంచెల భద్రత

49 వార్డుల ఎన్నికల ఓట్ల లెక్కింపు స్థానిక టీటీడీసీలో నిర్వహించారు. అభ్యర్థులతోపాటు అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందితో పాటు, అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లను, మీడియా ప్రతినిధులను క్షణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతించారు. కేఆర్‌కే కాలనీకి వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక డీఎస్పీ వెంకటేశ్వరరావుతోపాటు పట్టణ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌ బందోబస్తులో ట్రాఫిక్‌ పోలీసులతోపాటు వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌, జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల సిబ్బంది మొత్తం 400 మంది బందోబస్తు నిర్వహించారు.logo