సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 25, 2020 , 01:20:07

మున్సిపల్‌ కౌంటింగ్‌ నేడు

మున్సిపల్‌ కౌంటింగ్‌ నేడు
  • -టీటీడీసీలో ఏర్పాట్లు చేసిన అధికారులు
  • -147 మంది సిబ్బంది నియామకం
  • -11 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి
  • -16 వార్డుల చొప్పున లెక్కింపు

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని టీటీడీసీలో అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుండగా ఇందుకోసం 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రెండు హాళ్లలో ఆరేసి, మరో హాల్‌లో నాలుగు టేబుళ్లను వేశారు. ప్రతి టేబుల్‌లో మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను కౌంట్‌ చేస్తారు. పోలైన ఓట్లను 25 చొప్పన కట్టలు కట్టి రౌండ్ల వారీగా లెక్కపెడుతారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవనుండగా మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత మొదటి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. 49 వార్డుల ఫలితాలు సాయంత్రం 5 గంటల వరకు రావచ్చని అధికారులు తెలిపారు.
- ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి

మున్సిపాలిటీ ఎన్నికల ఓట్లు లెక్కింపు నేడు జరుగనుండగా టీటీడీసీలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా ఈ నెల 22న జరిగిన పోలింగ్‌లో 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను టీటీడీసీలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపర్చారు. నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభంకానుండగా మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. కౌంటింగ్‌లో భాగంగా టీటీడీసీలో 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక వార్డుకు సంబంధించిన ఓట్లను రెండు టేబుళ్లలో లెక్కిస్తారు. ప్రతి టేబుల్‌ వద్ద ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. కౌంటింగ్‌ ప్రారంభమైన వెంటనే పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఉన్న ఓట్లను డ్రముల్లో గుమ్మరిస్తారు. అందులో నుంచి 25 ఓట్ల చొప్పున కట్టలు కడుతారు. వీటిని ఓ బాక్స్‌లో వేసిన తర్వాత ఓట్లను తెరచి పార్టీలకు చెందిన ఏజెంట్లకు చూపిస్తూ ఆయా గుర్తులకు పడిన ఓట్లను వేర్వేరు బాక్సుల్లో వేస్తారు.

రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు

రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగనుండగా ప్రతి రౌండ్‌కు వేయి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఇలా 25 ఓట్ల చొప్పున కట్టిన 40 కట్టలను ప్రతి రౌండ్‌కు లెక్కించాల్సి ఉంటుంది. గుర్తులు సరిగా పడని ఓట్లను రిటర్నింగ్‌ అధికారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. చెల్లని ఓట్లను ప్రత్యేక బాక్స్‌లో వేస్తారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా కౌంటింగ్‌లో భాగంగా ఒకేసారి 16 వార్డులకు వేర్వురుగా ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రిటర్నింగ్‌ అధికారి మూడు వార్డులకు చెందిన ఫలితాలను పర్యవేక్షిస్తారు. తొలి 16 వార్డుల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత మిగితా 16 వార్డుల ఓట్లను లెక్కిస్తారు. 49 వార్డుల కోసం మూడు విడతలుగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. మొదటి ఫలితం ఉదయం 11 గంటల తర్వాత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల ఫలితాలు రావాలంటే సాయంత్రం 5 గంటల సమయం పడుతుంది.

147 మంది సిబ్బంది

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపులో భాగంగా 147 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీటికి అధికారులు టీటీడీసీలో శిక్షణ ఇచ్చారు. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభంగానుండగా సిబ్బంది ఉదయం 6 గంటలకు కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. అధికారులు వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తారు. కౌంటింగ్‌కు 32 మంది పరిశీలకులు, 32 మంది సూపర్‌వైజర్లు, 64 మంది సహాయకులను నియమించారు. వీరితో ముగ్గురు హాల్‌ సూపర్‌వైజర్‌లతో పాటు 16 మంది లేబర్‌లను కౌంటింగ్‌లో భాగంగా విధులు నిర్వహించనున్నారు. వివిధ వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కౌంటింగ్‌ కేంద్రాల్లోని బోర్డులపై రాయడంతో పాటు కంప్యూటర్‌లలో నమోదు చేస్తారు.logo