ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 24, 2020 , 00:55:40

మహిళా చైతన్యం

మహిళా చైతన్యం
  • -మున్సిపల్‌ ఎన్నికల్లో వారిదే పైచేయి
  • -ఓటు వేసిన 44,434 మహిళలు
  • -విలీన ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో 70.05 శాతం పోలింగ్‌ నమోదు కాగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ సందర్భంగా పలు వార్డుల్లో ఓటు వేసేందుకు మహిళలు ఆసక్తి కనబర్చారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 1,27,922 మంది ఓటర్లు ఉండగా 89,612 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 44,434 మంది, మహిళలు 45,178 మంది ఉన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తుండగా వీరు ఓటు వేసేందుకు ఆసక్తికనబర్చారు. పట్టణానికి సమీపంలో ఉండి గతంలో గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ఏరియాలో వార్డులు పునర్విభజనలో భాగంగా మున్సిపాలిటీలో కలువగా అక్కడ ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది.
- ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి మున్సిపాలిటీ ఎన్నికల్లో 49 వార్డుల్లో 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ వార్డుకు సంబంధించిన ఓటర్లు తమ వార్డు పరిధిలో ఓటువేసేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతు లాంటి వాటితో పాటు జాబితాలో ఎలాంటి సమస్యలు రాలేదు.

ఫలితంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం ఓట్లు 1,27,922 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 63,111 మహిళలు 64,805 ఇతరులు ఆరుగురు ఉన్నారు. వీరిలో 89,612 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో పురుషులు 44,434, మహిళలు 45,178 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. పోలింగ్‌ సందర్భంగా పలు వార్డుల్లో మహిళా ఓటర్లు బారులు తీరి కనిపించారు. దీంతో ఎక్కువ శాతం వార్డుల్లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటములను సైతం మహిళలు నిర్ణయించనున్నారు. ఆయా వార్డుల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు మహిళల ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మహిళల కోసం పలు పథకాలు అమలు

ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల సైతం మహిళల ఓటింగ్‌ శాతం పెరగడానికి కారణం అని చెప్పవచ్చు. ఆరేండ్లుగా ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను అమలు చేసింది. గర్భిణులు, బాలింతల కోసం ఆరోగ్యలక్ష్మీ, పేదింటి యువతుల వివాహాల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, భూమి లేని దళిత కుటుంబాల కోసం మూడెకరాల భూ పంపిణీ, ఆసరా, ఒంటరి మహిళా పింఛన్లు, మహిళల రక్షణ కోసం షీ టీమ్‌ ఏర్పాటు, మహిళా సంఘాల కోసం స్త్రీ నిధి రుణాల పంపిణీ, గర్భిణుల కోసం అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ల పంపిణీ లాంటి పథకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా మారాయి. ఫలితంగా మహిళలు ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటు వేసేందుకు ముందుకువచ్చారు.

విలీన ప్రాంతాల్లో భారీగా పోలింగ్‌

గతంలో మున్సిపల్‌ పరిధిలో 36 వార్డులు ఉండగా పునర్విభజనలో భాగంగా వార్డుల సంఖ్య 49కి పెరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న ఆదిలాబాద్‌ రూరల్‌, మావల మండలాల పరిధిలోని పలు గ్రామాలు మున్సిపల్‌ పరిధిలో చేరాయి. న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ, దుర్గానగర్‌, సుభాష్‌నగర్‌, సాయినగర్‌, దస్నాపూర్‌, కేఆర్‌కే కాలనీ, కైలాస్‌నగర్‌, దోభీకాలనీ, రాంపూర్‌, షాద్‌నగర్‌, టీచర్స్‌కాలనీ, టైలర్స్‌కాలనీ ప్రాంతాలు మున్సిపల్‌ పరిధిలోకి వచ్చాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. వార్డు నంబర్‌ 4 పరిధిలోని అనుకుంట, బంగారిగూడలో 81.47 శాతం, 17 వార్డు పరిధిలోకి వచ్చే రాంపూర్‌లో 82.46 శాతం, వార్డు నంబర్‌ 8 కేఆర్‌కే కాలనీలో 73.83 శాతం, వార్డు నంబర్‌ 13 టీచర్స్‌ కాలనీ, సుభాష్‌నగర్‌లో 75.85 శాతం, వార్డు నంబర్‌ 40 దోభీ కాలనీ, దస్నాపూర్‌లో 74.30 శాతం పోలింగ్‌ నమోదైంది. తక్కువగా వార్డు నంబర్‌ 41 టీచర్స్‌ కాలనీలో 55.03 శాతం, వార్డు నంబర్‌ 48 ద్వారకనగర్‌, హమీద్‌పు మున్సిపల్‌ క్వార్టర్‌లో 61.98 శాతం, వార్డు నంబర్‌ 37 హౌసింగ్‌బోర్డు, రవీంద్రనగర్‌, వినాయక్‌చౌక్‌ ఏరియాలో 63.91 శాతం పోలింగ్‌ నమోదైంది.logo