మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 24, 2020 , 00:55:40

గులాబీదే విజయం

గులాబీదే విజయం
  • -25న వచ్చే ఫలితాలు మా పనితీరుకు నిదర్శనం
  • - చిరస్మరణీయమైన విజయం అందుకోబోతున్నం
  • -టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జోగు ప్రేమేందర్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్యే జోగు రామన్న నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డులకు గాను 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీచేశారని తెలిపారు. తాజా సర్వేలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. 25న నిర్వహించే ఎన్నికల ఫలితాలు తమ పనితీరుకు నిదర్శనంగా నిలవనున్నాయని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంతో పట్టణంలో ఎక్కడా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. త్వరలో నూతన కౌన్సిల్‌ ఏర్పాటు అవుతుందన్నారు. ఇక పట్టణ ప్రజలకు అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ప్రతి కౌన్సిలర్‌ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిలా పనిచేస్తారన్నారు. నాన్న ఎమ్మెల్యే జోగు రామన్న అడుగు జాడల్లో నడుస్తూ పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ సాజిదొద్దీన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఆవుల వెంకన్న, అందె శ్రీదేవి, వాగ్మారే శైలేందర్‌, బండారి సతీశ్‌, దారవేణి సత్యనారాయణ, కయ్యుం, సంద నర్సింగ్‌ పాల్గొన్నారు.
logo
>>>>>>