బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 23, 2020 , 00:24:57

మున్సి ‘పోల్‌ 70.05 శాతం ’ప్రశాంతంగా పోలింగ్‌

మున్సి ‘పోల్‌ 70.05 శాతం ’ప్రశాంతంగా పోలింగ్‌
  • -వెల్లివిరిసిన చైతన్యం
  • -పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
  • -ఓటు వేసిన కలెక్టర్‌, ఎస్పీ
  • -వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ సరళి పరిశీలనగ్‌

 .ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన పోలింగ్‌లో 89,612 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది. 9 గంటల వరకు 8 శాతం పోలింగ్‌ నమోదైంది. తర్వాత మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో పోలింగ్‌ వేగం పుంజుకున్నది. పట్టణ ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పలు పోలింగ్‌ కేంద్రాల్లో భారీ క్యూలైన్లు కనిపించాయి. పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన శివారు పోలింగ్‌ కేంద్రాల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, కలెక్టర్‌ దివ్య, ఎస్పీ విష్ణువారియర్‌, జేసీ సంధ్యారాణితో పాటు పలువురు ప్రముఖులు ఓటు వేశారు.  

- ఆదిలాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి


ఆదిలాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికలో పోలింగ్‌ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డులు ఉండగా 1,27,922 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 49 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు ఇండిపెండెంట్‌లతో సహా మొత్తం 286 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణలో భాగంగా మంగళవారం సాయంత్రం సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తక్కువ సంఖ్యలో కనిపించారు. 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 8 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఉదయం చలిగాలులు వీయడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. 9 గంటల తర్వాత పోలింగ్‌ క్రమంగా వేగం పుంజుకున్నది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవడం ప్రారంభించారు. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు  బారులు తీరి కనిపించారు. దీంతో పోలింగ్‌ శాతం ప్రతి రెండు గంటలకు పెరుగుతూ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు 30.21 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 46.80 శాతం, 3 గంటలకు 59.26 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సమయం ముగిసిన 5 గంటలకు 70.05 శాతం పోలింగ్‌ నమోదైంది.


పోటెత్తిన ఓటర్లు

మున్సిపల్‌ పరిధిలో 49 వార్డుల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతీ, యువకులు, మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పలు వార్డుల్లో ఓటర్లు కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా ఓటు వేశారు. పట్టణంలోని పాత వార్డులతో పాటు పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కొత్త వార్డుల్లో సైతం ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేశారు. పట్టణంలోని పలు శివారు ప్రాంతాలు గతంలో గ్రామపంచాయతీల పరిధిలో ఉండి కొత్తగా మున్సిపల్‌ పరిధిలో కలువగా అక్కడ ఉదయం నుంచి ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.


పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి

మున్సిపాలిటీలో 49 వార్డుల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు 183 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొన్నది. వివిధ పార్టీలకు చెంది న నాయకులు తమ అనుచరులను ఓటర్లు లిస్టులతో పోలింగ్‌ కేంద్రాలకు దూరంలో ఉంచారు. ఆయా వార్డుల్లో తమ సంబంధికులు, బంధువు లు, మిత్రులు, పార్టీలకు అనుకూలంగా ఉన్న వా రు ఓటు వేయడానికి వచ్చారా లేదా అనే విషయాలను గమనించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత వార్డుల్లో ఉన్న ఓట్లలో ఎంత మంది ఓటు వేశారానే విషయాలతో పాటు తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయనే వాటిని అంచనా వేసుకున్నారు.


ఓటు వేసిన ప్రముఖులు

మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఓటు  హక్కు వినియోగించుకున్నారు. డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూ మారెడ్డి డైట్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాలలో, కలెక్టర్‌ దివ్య, ఎస్పీ విష్ణువారియర్‌, జేసీ సంధ్యారాణి 142 పోలింగ్‌ కేంద్రం సాత్నాల క్వార్టర్స్‌లో ఓటు వేశారు. వీరితో పాటు పలువురు, అధికారులు, వార్డుల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నా రు. పట్టణంలో నివాసం ఉంటూ ఇతర ప్రాంతా ల్లో ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తమ వార్డుల్లో ఓటు వేశారు.


వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన పట్టణంలోని పలు వార్డుల్లో ఓటింగ్‌ సరళిని అధికారులు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఇందుకోసం కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతున్న తీరును కలెక్టర్‌ దివ్య, జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ విష్ణువారియర్‌ మహాలక్ష్మివాడ, తిలక్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.logo
>>>>>>