మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 22, 2020 , 00:37:57

వలస ఓటర్లకు వల..!

వలస ఓటర్లకు వల..!
  • - ఎప్పుడూలేని వరుసలతో పలకరింపులు
  • - ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు
  • - రవాణా ఖర్చులు, భోజన వసతి ఏర్పాట్లు
  • - నేడు జరిగే ఎన్నికల్లో వలస ఓటర్లే కీలకం

పట్టణంలో ఉన్న ఓటర్లే కాకుండా పొట్ట కూటి కోసం, వ్యాపారం నిమిత్తం, చదువులకోసం వలస వెళ్లిన ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. ప్రతిరోజూ వలస ఓటర్లతో ఫోన్‌లో మాట్లాడి ‘నేను ఫలానా పార్టీ తరఫున మన వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీలో ఉన్న.. నాకే ఓటు వేయాల’ని వేడుకుంటున్నారు. బుధవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వలస ఓటర్ల ఖర్చులకు డబ్బులతోపాటు సకల మర్యాదలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని పట్టణానికి తరలించడానికి పోటీ పడుతున్నారు.
- ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: పట్టణంలో ఉన్న ఓటర్లే కాకుండా పొట్ట కూటి కోసం, వ్యాపారం నిమిత్తం, చదువులకోసం వలస వెళ్లిన ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. దీంతో పట్టణంలోని 49 వార్డుల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థుల చూపంతా ఇప్పుడు వలస ఓటర్లపైకి మళ్లింది. వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రతిరోజు వారితో ఫోన్‌లో మాట్లాడి ‘నేను పాలన పార్టీ తరఫున మన వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీలో ఉన్న.. నాకే ఓటు వేయాల’ని వేడుకుంటున్నారు. బుధవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వలస ఓటర్ల ఖర్చులకు డబ్బులతోపాటు సకల మర్యాదలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని పట్టణానికి తరలించడానికి పోటీ పడుతున్నారు.

వరుసలతో పలకరింపులు..

ఆదిలాబాద్‌ బల్దియా పరిధిలోని 49 వార్డులకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈఎన్నికల్లో వలస ఓటర్లు కీలకం కానున్నారు. పట్టణానికి ప్రజలు వ్యాపార నిమిత్తం, చదవుల కోసం, ఇతర జిల్లాల్లో, వివిధ రాష్ర్టాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది పొట్టకూటి కోసం హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఇతర జిల్లాలో ఉంటున్నారు. నేడు జరిగే బల్దియా ఎన్నికల్లో ఈ వలస ఓటర్లే కీలకం. కానున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఒక ఓటు తేడాతో అభ్యర్థులు ఓటమి పాలైన సంఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న వివిధ వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు ఈ వలస ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడని వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వరుసలతో కాక, మామ, తాత, అన్న, పెదనాన, తమ్ముడు, పిన్నీ, చెల్లె.. ఇలా వరుసలతో పలుకరింపులు మొదలు పెట్టారు. ముందుగా ‘అందరూ బాగున్నారా’.. అని అడిగి ఆ తర్వాత ‘నేను మన వార్డు నుంచి ఫలానా పార్టీ తరఫున కౌన్సిలర్‌గా పోటీలో ఉన్నాను.. మీరు తప్పకుండా వచ్చి ఓటు వేయాల’ంటూ వేడుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు వలస ఓటర్లకు బరిలో ఉండే అభ్యర్థులు మచ్చిక చేసుకుంటున్నారు.

రవాణా ఖర్చులు, భోజన వసతి..

ఎన్నికల ఫలితాన్ని శాసించే స్థాయిలో వలస ఓటర్లు ఉన్నారు. దీంతో బల్దియా పరిధిలోని 49 వార్డులకు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా.. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులు ఓటర్‌ లిస్టును పరిశీలించి సుమారు 25 శాతం మంది వలస ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్నికలకు వలస ఓటర్లు కీలకం కానుండగా.. వీరిని తీసుకురావడానికి కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కిలో మీటర్లను బట్టి ఒకరు ఆటో ఏర్పాటు చేసుకుంటే ఇంకొకరు కారులో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌, ఇతర రాష్ర్టాల్లో స్థిరపడ్డ వారికి మాత్రం రవాణా ఖర్చులను సైతం ఇచ్చేందుకు ముందస్తుగానే వలస ఓటర్లతో మాట్లాడుకున్నారు. ఓటు వేయడానికి వచ్చే ఈ వలస ఓటర్ల కోసం పట్టణంలో లాడ్జీలను బుకింగ్‌ చేస్తున్నారు. ఇలా అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. భోజన వసతితోపాటు ఆ రోజు అక్కడే బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొంత మంది అభ్యర్థులైతే ఒక్క రోజు ముందుగానే వాహనాలను ఏర్పాటు చేసుకొని వలస ఓటర్లను వారి ఇండ్లలోకి రప్పించుకుంటున్నారు. ఇలా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వలస ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.logo
>>>>>>