బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 22, 2020 , 00:30:50

కొండ కోనల్లో కొలువుదీరిన.. జంగుబాయి

 కొండ కోనల్లో కొలువుదీరిన..  జంగుబాయిఆదివాసీల గ్రామదేవత, మొదటి పూజలందుకునే జంగుబాయి మాత వద్ద మొదటి పూజ చేయడంతో గిరిజనులు పుష్యమాసాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఖాందేవ్‌, నాగోబాకు పూజలు, బుడుందేవ్‌, ఇతర దేవతకు పూజలు నిర్వహిస్తున్నారు. జంగుబాయి మాతకు ఆదివాసీ గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా నియమనిష్టలతో మొక్కులు తీర్చుకుంటారు. అయితే కొండకోనల్లో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గుహల్లో వెలిసిన జంగుబాయి మాత ఆలయంపై ప్రత్యేక కథనం....    - ఉట్నూర్‌ నమస్తే తెలంగాణ/నార్నూర్‌
x పుష్యం ఆదివాసీలకు
 పవిత్ర మాసం
x ప్రకృతి ఒడిలో అమ్మవారి మొక్కులు
తీర్చుకుంటున్న  గిరిజనం
- జంగుబాయికి మొదటి పూజ చేస్తున్న ఆదివాసీలు
-మొక్కులు తీర్చుకుంటున్నలక్షలాది  గిరిజనులు

జంగుబాయి సన్నిధిలో పుష్యమాసం సందర్భంగా ఎనిమిది గోత్రాలకు చెందిన ఆదివాసీలు పల్లె, పట్టణాలు, ఇతర రాష్ర్టాల నుంచి ఆదివాసీలు కలికనడకన తరలివచ్చి మొక్కులు చెల్లించి గ్రామీణ దేవలకు పూజలు నిర్వహిస్తారు.

పుష్యమాసంలో జంగుబాయికి పూజలు...

 పవిత్రమైన పుష్యమాసం ఆదివాసీలకు చాలా పవిత్రం. ఈ రోజుల్లో సంస్కృతీ సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి మహారాష్ట్ర సరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కోటా పరందోళి శివారులో కొలువుదీరి ఉంది. ఈ మాసం చివరిరోజు వరకు భక్తుల తాకిడితో ఆలయం కిటకిటలాడుతున్నది.

ఎనిమిది గోత్రాల పూజారులతో పూజలు..

ఆదివాసీల్లో తుమ్రం, రాయిసిడడాం, కొడప, సలామ్‌, వెట్టి, మర్ప, హెరకుమ్ర, మండాడి.. వంటి 8 గోత్రాల ప్రజలు ఉంటారు. అందుకే జంగుబాయి దేవస్థానంలో ఎనిమిది గోత్రాలకు చెందిన ఖాటోడాలు (పూజారులు) పూజలు నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చిన ఆదివాసీలను ఆహ్వానిస్తూ, సంప్రదాయబద్దంగా పూజలు చేయిస్తారు. పుష్యమాసం చివరిరోజు వరకు ఆలయంలో ఉన్న ఉంటూ దేవస్థానానికి వచ్చే భక్తులు అవస్థలు పడకుండా చూస్తారు. దగ్గరుండి కొండలోని గుహల్లోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మొక్కులు తీర్చుకున్న భక్తులు ఎనిమిది గోత్రాల పూజారులకు కండువా, నగదును అందించి పాదాలకు మొక్కుతుండడం ఇక్కడ అనవాయితీగా వస్తున్నది.

గ్రామ దేవతలతో తరలి వస్తున్న గిరిజనులు..

జంగుబాయి దేవస్థానానికి సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఆదివాసీలు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి జిల్లాలతోపాటు చత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆదివాసీలు దర్శనానికి వస్తుంటారు. గ్రామీణ దేవతలు నాగోబా, అవ్వాల్‌, కావాడ్‌, భీమల్‌పేన్‌లను గంగాజలంతో శుద్ధి చేసి జంగుబాయి ఆలయంలో (బేటీ) చూపిస్తూ పూజలు చేస్తారు. అనంతరం తమతమ గ్రామాల్లో ప్రతిష్ఠాపించుకుంటారని ఆదివాసీ పెద్దలు తెలిపారు.

టోపాలకసాలో స్నానం..

దేవస్థానం చేరుకునే ముందు టోపాలకసా గంగలో ఆదివాసీలు స్నానాలు చేసి, మొక్క లు చెల్లించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి వెళ్తారు. వారి సంప్రదా లయాలతో పూజలు చేస్తారు.

నవధాన్యాలతో నైవేద్యం సమర్పణ..

ఆదివాసీలు పండించిన కొత్త పంటల ధాన్యాలతో నైవేద్యంగా తయారు చేస్తారు. ఇం టి వద్ద తయారు చేసిన శుద్ధమైన నువ్వుల తైలంతో వంటకాలు చేస్తారు. జంగుబాయికి నైవేద్యంగా సమర్పించి కొత్తగా పండించిన ధాన్యాలను తినడం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో అన్నదానం చేస్తారు.

అభివృద్ధిని పట్టించుకోని మహారాష్ట్ర ప్రభుత్వం..

జంగుబాయి దేవస్థానం మహారాష్ట్రలో ఉండడంతో అక్క డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల నుంచే ఆదివాసీలు జంగుబాయి దేవస్థానంకు పెద్దఎత్తున వస్తుంటారు. కొండకోనల్లో ఉన్న జంగుబాయికి సౌకర్యాలు కల్పించడంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుంది. కాని తెలంగాణ ప్రభుత్వమే ఏటా పుష్యమాసం లో రూ.10 లక్షలు కేటాయిస్తుంది. దీంతో అక్కడ ఆలయ నిర్మాణం, ముఖద్వారం, రోడ్డు పనులు ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జంగుబాయి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆదివాసీలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. logo