గురువారం 09 ఏప్రిల్ 2020
Adilabad - Jan 21, 2020 , 00:29:51

కాయ్‌ రాజా కాయ్‌!

కాయ్‌ రాజా కాయ్‌!
  • -అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగ్‌ జోరు
  • -పట్టణంలో వాడవాడల్లో పందేలు
  • -లాడ్జీలు, హోటళ్లలో పందెం రాయుళ్ల అడ్డాలు
  • -భారీగా నగదు చేతులు మారుతున్న వైనం

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: తమ అభ్యర్థులే గెలుస్తారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అటు ఆసక్తి ఉన్న సామాన్యులు కూడా గెలుపు ఓటముపై చాలెంజ్‌లు చేస్తున్నారు. బెట్టింగులు కడుతున్నారు. దీనితో బల్దియా ఎన్నికలు  ఒక జూదంలా మారింది. ఆదిలాబాద్‌ బల్దియా పరిధిలోని 49 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఓటమిలపై ఇప్పటికే అనేక మంది నాయకులు, వ్యాపారులు, చోటా మోటా నాయకులు జిల్లాకేంద్రంలో బెట్టింగులు కడుతూ కాయ్‌ రాజా కాయ్‌ ఒకటి.. రెండు.. రెండుకు.. నాలుగు.. అంటూ పందెం రాయుళ్లు బెట్టింగులకు పాల్పడుతున్నారు. లాడ్జీలు, హోటళ్లు, పాన్‌షాప్‌లు, కటింగ్‌షాప్‌లు ఎక్కడికి వెళ్లినా అందరినోటా ఇదే మాట వినిపిస్తున్నది. వార్డుల వారీగా ఆయా పార్టీల తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులు గెలుస్తారని పందేలు కడుతున్నారు. భారీ మొత్తం డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తున్నది.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే అయా పార్టీల నాయకులు అభ్యర్థుల కోసం సర్వే చేయించిన విషయం తెలిసిందే కాగా.. మరి కొద్ది గంటల్లో ఎన్నికల జరుగనుండగా.. పలువురు పందెం రాయుళ్ల బెట్టింగులు జోరందుకున్నాయి. పట్టణంలోని 49 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఓటములపై ఇప్పటికే అనేక మంది బడానాయకులు, చోటామోటా కార్యకర్తలు, వ్యాపారుల వరకు భారీ మొత్తంలో డబ్బులతో పోటీలోకి దిగుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల ప్రకటన జారీ అయినప్పటి నుంచి పట్టణంలో పందేల పరంపర కొనసాగుతున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీతో చైర్మన్‌ అవుతారని కొందరు, ఇతర పార్టీల ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులే అధిక సీట్లు గెలుచుకుంటారని మరి కొందరు ఇలా పందేలు కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. బుధవారం ఎన్నికలు, 25న ఫలితాలు వెలువడనుండగా.. పందెం రాయుళ్లు జిల్లాకేంద్రంలోని లాడ్జీలు, హోటళ్లలో అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని పందేలు కడుతున్నారు. ఇప్పటి వరకు భారీగా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తున్నది.

ఇరు పార్టీల ప్రచార హోరును గమనించిన పందెం రాయుళ్లు వార్డుల వారీగా గెలిచే అభ్యర్థులు, ఓటమి చెందే అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థికి వచ్చే మెజార్టీలపై పందెం కాస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి చైర్మన్‌ ఏర్పాటుపై లక్షల రూపాయల పందేలు కడుతున్నారు. ఇప్పటికే పట్టణంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. పందెంలో పెట్టిన నగదు రూపంలో సొమ్మును ఇరు పక్షాలకు ఆమోదయోగ్యం అయితేనే పెద్ద మనషుల దగ్గర పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. మరికొందరైతే ఏకంగా దస్ర్తావేజులు సైతం రాయించుకొని పందేలకు దిగడం గమనార్హం. ఆదిలాబాద్‌ బల్దియా పరిధిలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థుల గెలుపు అంచనాలు స్పష్టంగా కనబడుతున్నప్పటికీ కొందరు అతి ఉత్సాహంగా పందెం రాయుళ్లు ఇతర పార్టీల కౌన్సిలర్‌ అభ్యర్థులు గెలుస్తారని బెట్టింగులు కడుతున్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికీ బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందని అన్ని సర్వేలు స్పష్టం చేయడంతో కారుజోరు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 22న ఎన్నికల అనంతరం 25న లెక్కింపు రోజున అభ్యర్థుల భవితవ్యం తెలనున్నది.logo