శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 20, 2020 , 01:30:07

బల్దియా ఎన్నికలకు భారీ బందోబస్తు

బల్దియా ఎన్నికలకు భారీ బందోబస్తు
  • -విధుల్లో 606 మంది పోలీసులు
  • -సమస్యాత్మక పీఎస్‌ల వద్ద ఏడుగురు సాయుధులు
  • -సాధారణ పీఎస్‌ల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు
  • -పెట్రోలింగ్‌కు 18 రూట్‌ మొబైల్‌ టీములు
  • -ఎస్పీ కార్యాలయంలో ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటు
బల్దియా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 22న మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో నిర్వహించే ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 40 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 8 పీఎస్‌లకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రూట్‌ మొబైల్‌ టీములను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఎస్పీతో పాటు ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు హెచ్‌సీలు, పీసీలు, హెచ్‌జీలు, సాయుధ బలగాలు సహా మొత్తం 606 మంది పాల్గొంటున్నారు.
- ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఈ నెల 22న బల్దియా పరిధిలోని 49 వార్డుల్లో జరిగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలింగ్‌ శాతం పెంచడానికి పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పట్టణంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి సాయుధ పోలీసు బలగాలు, సాధారణ కేంద్రాల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లుతో బందోబస్తును  ఏర్పాటు చేస్తున్నారు. 8 పీఎస్‌లకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రూట్‌ మొబైల్‌ టీములను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఎస్పీతో పాటు ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు హెచ్‌సీలు, పీసీలు, హెచ్‌జీలు, సాయుధ బలగాలు మొత్తం 606 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

భారీ బందోబస్తు..

బల్ధియా ఎన్నికల్లో గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గతంలో బల్దియా పరిధిలో 36 వార్డులు ఉండేవి. పట్టణాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన మున్సిపాలిటీ చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణ సమీప గ్రామాలు మావల, బట్టిసావర్గాం పరిధిలోని కొన్ని వార్డులు విలీనం చేయగా, అనుకుంట, బంగారుగూడ, బెల్లూరి, రాంపూర్‌ గ్రామాలను సంపూర్ణంగా విలీనం చేశారు. దీంతో బల్దియా పరిధి పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు వార్డుల పునర్విభజన చేపట్టి 49 వార్డులను ఏర్పాటు చేశారు. ఈ నెల 22న వార్డులకు ఎన్నికలు జరుగనుండగా 606 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2014లో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

40 సమస్యాత్మక కేంద్రాలు..

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులకు గాను 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న చెదురు మదురు ఘటనల నేపథ్యంలో ఈ సారి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పట్టణంలో 40 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుల్‌, నలుగురు సాయుధులను ఏర్పాటు చేస్తున్నారు. 18 రూట్‌ మొబైల్‌ టీములను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టీములో ఇన్‌చార్జిగా ఏఎస్‌ఐ లేదా హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను నియమిస్తున్నారు. అలాగే స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లో ఇన్‌చార్జిగా ఎస్సైలను నియమించగా.. స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లో ఇన్‌చార్జిగా డీఎస్‌పీ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లను నియమించారు. 8 పీఎస్‌లకు క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ప్రతి పీఎస్‌ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జీపీఎస్‌ సిస్టం ద్వారా జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ, మున్సిపల్‌ కార్యాలయాలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడానికి ఎస్‌పీ కార్యాలయంలో ఎలక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేసి నెంబర్‌ 9490619045 అందుబాటులోకి తీసుకువచ్చారు. బందోబస్తులో విధులు నిర్వర్తించే సిబ్బందికి 200 మొబైల్‌ హ్యాండ్‌సెట్‌లను అందజేస్తున్నారు.logo