సోమవారం 30 మార్చి 2020
Adilabad - Jan 18, 2020 , 23:57:33

గడప గడపకూ గులాబీదళం

గడప గడపకూ గులాబీదళం
  • -ప్రచారంలో కారు జోరు
  • -జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే జోగు రామన్న రోడ్‌ షో
  • -టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు జననీరాజనం
మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళ్తున్నది. ప్రతిపక్షాలను వెనక్కి నెట్టి కారు దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. అభ్యర్థులకు మద్దతుగా శనివారం జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలు, పాదయాత్రల్లో పాల్గొంటున్నారు. ప్రధాన కూడళ్లలో రోడ్‌షో నిర్వహిస్తున్నారు.

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గులాబీదళం దూకుడు పెంచి ముందుకు కదులుతున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రతి ఇంటి తలుపు తడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ర్యాలీలు నిర్వహించారు.

జోరందుకున్న ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందుకున్నది. ఈ నెల 15 నుంచి ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆయా కాలనీల్లో ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఏకాలనీకి వెళ్లినా గులాబీ జెండాలు దర్శనమిస్తున్నాయి. అభ్యర్థుల వెంట ఆయా కాలనీల ప్రజలు వయోభేదం లేకుండా స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ దూకుడును చూసి ప్రతిపక్ష పార్టీలు నివ్వెరపోతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రాచారాస్ర్తాలు లేక ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి.
అభ్యర్థులకు మద్దతుగా ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా శనివారం జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాంనగర్‌, టీచర్స్‌ కాలనీ, కైలాస్‌నగర్‌ కాలనీలతో పాటు శాంతినగర్‌, బొక్కలగూడ, రవీంద్రనగర్‌లో అభ్యర్థుల తరఫున ఇంటింటా ప్రచారం చేశారు. ఆయా వార్డుల్లో ర్యాలీలు నిర్వహించారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఓటర్లకు వివరిస్తున్నారు. గతంలో పట్టణంలో చేపట్టిన పనులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తాం..


- ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు
- జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌
ఆదిలాబాద్‌ మరింతగా అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యం అని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి పక్షపార్టీల నేతలు కల్లబొల్లి మాటలతో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను ఓటర్లు నమ్మవద్దని అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అభివృద్ధి చెందిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ మరింగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని, రాబోయే రోజుల్లో ఆ పార్టీలు కూడా కనుమరుగైపోతాయన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు ఎదురు చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ఆదిలాబాద్‌ బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ గొడాం నగేశ్‌, జడ్పీటీసీలు అనిల్‌ జాదవ్‌, చారులత రాథోడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కస్తాల ప్రేమల, ఇజ్జగిరి అశోక్‌, దుర్గం శేఖర్‌, తుల శ్రీనివాస్‌, కేదరేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.logo