సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 18, 2020 , 23:56:14

ఎన్నికల టీం రెడీ

 ఎన్నికల టీం రెడీ
  • -ఎన్నికల నిర్వహణకు 1,306 మంది సిబ్బంది
  • -5 ఫ్లయింగ్‌ స్కాడ్‌, 12 స్టాటిస్టికల్‌ టీములు
  • -సమస్యాత్మక కేంద్రాల వద్ద లైవ్‌ కెమెరాలు
  • -ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

మున్సిపల్‌ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో పోలింగ్‌ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తికాగా, పోల్‌ చీటీల పంపిణీ చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఇదివరకే నియమించగా.. వారికి దశల వారీగా శిక్షణ సైతం పూర్తి చేశారు. పట్టణంలో 49 వార్డులు ఉండగా.. 183 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,306 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఫ్ల్లయింగ్‌ స్కాడ్‌, ఎస్‌ఎస్‌ టీంలు, అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అధికారులు, వ్యయ పరిశీలకులతోపాటు సమస్యాత్మక కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఈ నెల 22న ఆదిలాబాద్‌ మున్సిపల్‌కు ఎన్నిక నిర్వహించనున్నారు.
- ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వివిధ విభాగాల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఫ్ల్లయింగ్‌ స్కాడ్‌, ఎస్‌ఎస్‌ టీంలు, అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అధికారులు, వ్యయ పరిశీలకులు, సమస్యాత్మక కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు.

బల్దియా ఎన్నికలు ఈ నెల 22న జరుగనుండగా.. ఇందుకు గాను అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఫ్లయింగ్‌ స్కాడ్‌ టీం ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండగా.. ఒక నాయబ్‌ తహసీల్దార్‌, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను నియమించారు. పట్టణ సరిహద్దు గుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌ టీం (ఎస్‌ఎస్‌టీ)లను సైతం ఏర్పాటు చేశారు. అసిస్టెంట్‌ ఎలక్షన్‌ అధికారితో పాటు వ్యయ పరిశీలకులను నియమించారు. మొత్తం 44 లోకేషన్లలో 23 అతి సమస్యాత్మక, 21 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు, పోలీసులు సంయుక్తంగా సర్వేచేసి నిర్ధారించారు. ఈ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను చేపట్టారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్‌లను నియమించారు. ఎన్నికల రోజు ప్రత్యేక బృందాలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు సరళిని తెలుసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేస్తాయి. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ దశల వారీగా ఇచ్చి సిద్ధం చేశారు.

బల్దియా పరిధిలోని 49 వార్డులకు ఈ నెల 22న ఎన్నికలు జరుగనుండగా.. విధుల్లో వివిధ శాఖలకు చెందిన 1,306 మంది కొనసాగనున్నారు. పోలింగ్‌ బూత్‌లో విధులు నిర్వహించే అధికారులతో పాటు పర్యవేక్షణ, ఇతర విధులను నిర్వహించేందుకు అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కేటాయించారు. ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, (ఏపీవో), స్టాటిస్టికల్‌ టీంలను ఏర్పాటు చేసి ఒక్కో టీంలో ముగ్గురు అధికారులను నియమించారు. ముగ్గురు వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేశారు. 44 సమస్యాత్మక కేంద్రాలుండగా.. ఈ కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి 44 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వెబ్‌క్యామ్‌లను ఏర్పాటు చేసి జీపీఎస్‌ సిస్టంతో కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తూ ఏమైనా సంఘటనలు చోటు చేసుకుంటే అప్పటికప్పుడు అప్రమత్తం చేయనున్నారు. ఇలా అధికారులు బల్దియా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి పోలింగ్‌ సరళిని పెంచడానికి ముందస్తు చర్యలను చేపట్టారు. logo